PELALA VADALU: నూనె పీల్చని క్రిస్పీ పేలాల వడలు, పిండి పులియాల్సిన అవసరమూ లేదు

మినప్పప్పు, పెసరపప్పు, బియ్యం పిండితో.. ఇలా చాలా రకాలుగా వడలు చేసుకునే ఉంటారు. కానీ పేలాలు లేదా మరమరాలతో ఎప్పుడైనా వడలు చేశారా? అయితే ఒకసారి చేసి చూడాల్సిందే. ఉదయం అల్పాహారంలోకి, సాయంత్రం పూట స్నాక్ లోకి కూడా ఈ వడలు బాగుంటాయి. ఉన్నట్టుండి ఏం చేయాలో తోచనప్పుడు ఇంట్లో పేలాలుంటే చాలు ఈ వడలు చేసేయొచ్చు. పిండి పులవాల్సిన అవసరం కూడా లేదు. వీటిని ఎలా తయారు చేయాలో చూసేయండి.

పేలాల వడలకు కావాల్సిన పదార్థాలు:

6 కప్పుల పేలాలు

సగం కప్పు బియ్యంపిండి

2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కల తరుగు

ఒక కరివేపాకు రెబ్బ, సన్నటి తరుగు

అరచెంచా జీలకర్ర

అరకప్పు కొత్తిమీర తరుగు

పావు చెంచా మిరియాల పొడి

అర చెంచా ఉప్పు

పావు కప్పు పెరుగు

పేలాల వడల తయారీ విధానం:

1. ముందుగా పేలాలు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పిండేసి పక్కన పెట్టుకోవాలి.

2. ఒక వెడల్పాటి పాత్రలో కడిగిన పేలాలను వేసుకుని చేత్తో బాగా మెదిపినట్లు చేయాలి.

3. అందులో ఒక కప్పు బియ్యం పిండి, పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరిగిన కరివేపాకు, మిరియాల పొడి, ఉప్పు, పెరుగు కూడా వేసుకోవాలి.

4. అన్నీ బాగా కలిసేలా మెదుపుతూ మెత్తగా కలుపుకోవాలి. నీళ్లు అస్సలు వాడకూడదు. ముందు గట్టిగా అనిపించినా పేలాల్లో ఉండే నీళ్ల వల్ల పిండి మెత్తగా అయిపోతుంది.

5. ఇప్పుడు చేతికి నూనె రాసుకుని వడల్లాగా ఒత్తుకోవాలి.

6. కడాయిలో నూనె పోసుకుని వేడి అయ్యాక అందులో ఈ వడలు వేసుకుని రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి.

7. ఇవి తినడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని మీకిష్టమైన ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి.

ఎప్పుడూ ఒకే రకమైన వడలు తినడం కాస్త కష్టం అనిపిస్తే ఇవి మంచి చాయిస్. పిల్లలకు కూడా సాయంత్రం పూట కరకరలాడే స్నాక్ చాలా తక్కువ సమయంలోనే రెడీ చేసి ఇవ్వొచ్చు. పిల్లల లంచ్ బాక్స్ లో పెట్టిచ్చినా ఇష్టంగా తింటారు.

2024-09-10T01:27:43Z dg43tfdfdgfd