RARE FRUIT: ఆ జిల్లాలో అరుదైన పండు .. రుచి చూస్తే వదిలిపెట్టరు..

ప్రకృతిలో మనకు కాలానుగుణంగా ఎన్నో రకాల పండ్లు, పూలు లభిస్తుంటాయి. కొన్ని సహజ సిద్ధంగా లభిస్తే, మరికొన్ని సాగు చేస్తే వస్తున్నాయి. అయితే పూల విషయం కొద్దిగా పక్కన పెట్టి, పండ్లు ఫలాల విషయాలను చెప్పుకుందాం. కొన్ని పండ్లు మనకు సంవత్సరం పొడవునా లభిస్తాయి. కానీ కొన్ని పండ్లు మాత్రం సీజనల్‌గానే లభిస్తాయి. అలా సీజనల్‌గా లభించే పండ్లలో బుడింపండు ఒకటి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే లభించే అరుదైన పండు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. ఇది తీగ జాతి మొక్కకు కాసే ఫలం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది కూడా రెండు మూడు నెలలు మాత్రమే లభిస్తాయి. ఆకుపచ్చ రంగులో ఉన్న కాయలు పండి పసుపు పచ్చ రంగులోకి మారతాయి. మరి కొంత పండి ఆ పండు పగుళ్లు కూడా తేలుతుంది. అలా పగిలిన పండు సువాసనలను వెదజల్లుతుంది. ఆ పరిమళాలు దారి వెంట వెళ్లేవారి చూపును తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి.

ఈ బుడింపండును తింటే రుచి ఎంతో మధురంగా ఉంటుంది. కొందరు కేవలం బుడిం పండును మాత్రమే తింటారు. కానీ ఆదిలాబాద్ ప్రాంతంలో మాత్రం ఆ పండును ముక్కలుగా కోసుకొని అందులో పంచదారను కలుపుకొని తింటారు. ఇలా బుడింపండుకు పంచదారను జోడించడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది. పంటపొలాల్లో, పత్తి, కంది, జొన్న చేలలో ఈ బుడిం పండు లభిస్తుంది. దీనికి ఏ మందులు వాడకపోయినా సాధారణ వర్షాలకు సహజంగా ఈ పండ్లు కాస్తాయి. పొలంలో రోజంతా వ్యవసాయ పనులు చేసుకునే కూలీలకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది.

ఒక పండు లేదా సగం పండు తిన్నా సరే కడుపు నిండిపోతుంది. ఇక ఆకలి అనిపించదు. తినడానికి ఎంతో మధురంగా ఉండే ఈ బుడింపండులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మరీ ఎక్కువగా తీపిగా ఉండదు. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం కూడా కలిగి ఉండటంతో జీర్ణ సంబంధ సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది.

పంటపొలాల్లో, మారుమూల అటవీ ప్రాంతాల్లో మాత్రమే లభ్యమయ్యే ఈ బుడింపండ్లను గంపలో పెట్టుకొని పట్టణాలకు తీసుకువచ్చి విక్రయిస్తూ కొందరు కొద్ది రోజులపాటు ఉపాధిని కూడా పొందుతున్నారు. ప్రధాన రహదార్లకు ఇరువైపులా వీటిని పెట్టుకొని కూర్చొని గ్రామీణ ప్రాంత మహిళలు విక్రయిస్తుంటారు. ఎక్కువగా గిరిజన మహిళలు వీటిని తీసుకువచ్చి రోడ్డు పక్కన, ప్రధాన కూడళ్లలో కూర్చొని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.

అన్ని వయసుల వారు ఆనందంగా ఈ పండును తింటారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే లభించే ఈ బుడింపండ్లు ఆరోగ్యంతోపాటు కొందరికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ బుడిం పండు రుచి చూడాలంటే మీరు ఒక్కసారి ఆదిలాబాద్‌కు వెళ్లాల్సిందే.

2024-09-16T10:36:36Z dg43tfdfdgfd