VINAYAKA CHAVITHI | ఈ గణపతిని పూజిస్తే.. 40 రోజుల్లోనే కోరికలు తీరుతాయట..!

Vinayaka Chavithi | వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా గణనాథుల సందడి కనిపిస్తుంది. భిన్న ఆకృతులు, ప్రత్యేక రూపాల్లో గణేషుడి విగ్రహాలు కనువిందు చేస్తుంటాయి. అయితే వినాయకుడికి సంబంధి ఓ ఆలయానికి ప్రత్యేకత ఉన్నది. అక్కడి గణేషుడికి పది చేతులు ఉంటాయి. కుడివైపున తొండం ఉండి.. పక్కన ఒక చేత్తో భార్య సిద్ధిని ఆలింగనం చేసుకొని ఉంటారు ఆ విఘ్నాల అధిపతి. అదే ఆంధ్రప్రదేశ్‌లోని రాయదుర్గం దశభుజ గణపతి ఆలయం.

దేశంలో ఎక్కడా లేని విధంగా 10 చేతులు గల విఘ్నేశ్వరుడు ఇక్కడ కొలువుదీరాడు. మూడు కళ్ళతో భక్తులకు దర్శనమిస్తూ త్రినేత్రుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఎక్కడైనా వినాయకుడికి తొండం ఎడమవైపు ఉంటుంది కానీ.. ఈ ఆలయంలో మాత్రం దేవదేవుడి తొండం కుడివైపునకు తిరిగి ఉండటం ఒక ప్రత్యేకత. లంబోధరుడికి ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్ధి.. కానీ ఇక్కడున్న ఏకదంతుడు మాత్రం ఎడమవైపు భార్య సిద్ధిని చేత్తో ఆలింగణం చేసుకొని ఉన్నట్లు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడి గణేషుడిని సిద్ధి సమేతుడు అని భక్తులు పిలుస్తారు.

దశభుజ వినాయకరూపం షోడశగణపతి రూపాలలో ఒకటి. ఇది శ్రీమహాగణపతి రూపం. ఈయన సమగ్రమూర్తి. పదిబాహువులతో కుడిచేత చక్రం, ఓషధి, కలువపువ్వు, నిధి ధరించి ఉంటాడు. ఎడమచేత పాశం, చెరకుగడ, పద్మం, గద ధరించి ఉంటాడు. కిరీటంపై అర్ధచంద్రుడి అలంకారం అలరారుతుంటుంది.

సుమారు 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో మూలమూర్తి విగ్రహం ఉంటుంది. వందల ఏండ్ల క్రితం నిర్మించిన గణపతి ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారాలనే ఇప్పటికీ పాటిస్తున్నారు. పూర్ణ టెంకాయతో నైవేద్యం సమర్పించడం అక్కడి ఆచారం.

స్వామి వారికి పూర్ణ టెంకాయను సమర్పిస్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కుడి చేతిలో పూర్ణ ఫలముతో, తల పైన పూర్ణ ఫలముతో వెలిసిన ఈ మహా గణపతి విశేషమైన పూజలందుకుంటున్నాడు. ఈ పూర్ణ ఫలం ఉండడం వల్ల పూర్ణ టెంకాయను వారికి సమర్పించి మనసులో ఏ కోరిక కోరినా నెరవేరుతుందనే నమ్మకం ఇక్కడ బలంగా ఉంది. ఇక్కడికొచ్చి భక్తులు తమ తమ కోర్కెలు తీర్చుకోవడానికి పూర్ణ టెంకాయాలతో వస్తుంటారు. టెంకాయను మనసులో కోర్కెను కల్పించుకొని స్వామి వారి దగ్గర పెడితే 21 రోజుల నుంచి 40 రోజుల లోపు అవి కచ్చితంగా ఫలిస్తాయని కాయలు పెట్టే ఆచారం అనాదిగా వస్తున్నది. తొలినాళ్లలో స్వామివారి విగ్రహం చిన్నదిగానే ఉండేదని.. కాల క్రమేణ పెరుగుతూ వస్తున్నదని తెలిపారు.

2024-09-07T04:25:20Z dg43tfdfdgfd