WINE SHOPS CLOSED : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్

Liquor Shops Close in Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. వీకెండ్‌లో మందు పార్టీలతో మజా చేయాలనుకునే వారికి సిటీ పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చెప్పేశారు.   ఆది, సోమవారాలు రెండ్రోజుల పాటు సిటీలో మద్యం అమ్మకాలు జరపకూడదని ఆదేశించారు. వాస్తవానికి ఈ రోజుల్లో ఏ ఫంక్షన్ అయినా ముక్క, సుక్క ఉండాల్సిందే.  సుక్క లేకుండా  దాదాపు ప్రస్తుతం ఏ వేడుక జరగడం లేదు. వీకెండ్స్, పండగ రోజుల్లో అయితే అన్ని ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతుంది. ఇక కొందరికి అయితే చుక్క పొట్టలోకి పోకపోతే పూట గడవని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడెప్పుడు లిక్కర్ షాపులు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు.  బాధొచ్చినా.. సంతోషం వచ్చినా మందుతో సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అన్నట్లు తయారయ్యారు ఈ రోజుల్లో జనాలు.  ఒక్కరోజు మద్యం షాపులు మూసినా జనాలు విలవిల్లాడిపోతుంటారు.  ఇలాంటి వారికి  మద్యం షాపులు రెండు రోజుల పాటు బంద్ అవుతున్నాయంటే ఎంతటి బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు వైన్స్ షాపులు ఏ కారణంతో బంద్ కానున్నాయో తెలుసుకుందాం. 

ఘనంగా బోనాలు

ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తోంది. దీంతో హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. భక్తి శ్రద్ధలతో అమ్మ వార్లకు బోనాలు సమర్పించి కొలుస్తుంటారు భక్తులు. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకతవకలు  చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు  వైన్సులు  మూసి వేయాలని నిర్ణయించారు.  మహంకాళీ బోనాల పండుగ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్ లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్ని  వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎల్లుండి అంటే జూలై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులన్నీ మూసివేయబడతాయి.  

 ఆరు గంటల నుంచే బంద్

 సౌత్ ఈస్ట్ జోన్‌లో చాంద్రాయణగుట్ట , బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటలనుంచి 24 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చైటినాక, షాలి బండ , మీర్‌చౌక్ ప్రాంతాల్లో జూలై 28 ఉదయం 6 గంటలనుంచి రెండు రోజుల పాటు కల్లు, వైన్స్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు , క్లబ్బులు , మద్యం విక్రయించే లేదా సరఫరా చేసే ఇతర సంస్థలు మూసివేయబడతాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు లిక్కర్ దుకాణాలు మూతపడనుండడంతో మద్యం ప్రియులు ఉసూరుమంటున్నారు. ఇటీవల పలు పండగల నేపథ్యంలో వైన్సులు మూసి వేస్తుండడంతో మద్యం ప్రియులు నిరాశ చెందుతున్నారు.

చర్యలు తప్పవు

డ్రై డేలో లిక్కర్ కొనుగోలు చేస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ రెండు రోజులు కూడా ఇదే తరహా నిబంధనలను అమలు చేయనున్నారు. మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా  అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. పాత బస్తీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఆయా రూట్లలో వాహనాలను కూడా మళ్లించనున్నారు. ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

2024-07-26T16:59:58Z dg43tfdfdgfd