అక్షయ తృతీయను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు..? పండుగ ప్రాముఖ్యత తెలుసా..?

భారతదేశం అంతటా హిందువులు, జైనులు జరుపుకునే పండుగ అక్షయ తృతీయ (Akshaya Tritiya). ఇది వసంత రుతువులో వస్తుంది. ఈ ఏడాది మే 10న అక్షయ తృతీయ వచ్చింది. వైశాఖ మాసం శుక్ల పక్షంలో మూడవ రోజున వచ్చే ఈ పర్వదినానికి భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. ఈ పండుగ సిరిసంపదలతో పాటు తరగని సంతోషాన్ని, పుణ్యాన్ని అందిస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ పేరులోని "అక్షయ" అనే పదానికి సంస్కృతంలో ఎప్పటికీ తరగనిది అని అర్థం వస్తుంది. అంటే ఈ రోజు శాశ్వతమైన శ్రేయస్సును తెస్తుందని, రోజురోజుకీ వృద్ధిని కలిగిస్తుందని నమ్ముతారు. హిందువులు ఈ పండుగను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? దీనికి ఎందుకు ప్రత్యేకమైన విశిష్టత ఉందో తెలుసుకుందాం.

* చరిత్ర, పురాణాల ప్రాముఖ్యత

పురాణాలలోకి వెళ్తే, హిందూ మత గ్రంథాల ప్రకారం నాలుగు యుగాలలో మూడవది అయిన త్రేతాయుగం ఈ రోజే ప్రారంభమైందని చెబుతారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు ఆరవ అవతారం అయిన పరశురాముడు జన్మించాడని ప్రజల ప్రగాఢ నమ్మకం. పవిత్ర నది అయిన గంగానది స్వర్గలోకం (పరమేశ్వరుడి జటాజూటం) నుంచి భూమికి దిగి వచ్చింది కూడా అక్షయ తృతీయ నాడే అని పురాణాలు చెబుతున్నాయి.

మహాభారతంలో కూడా అక్షయ తృతీయకు విశేష ప్రాముఖ్యత ఉంది. వనవాసంలో ఉన్న పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్ర (ఎప్పుడూ ఆహారం అందించే పాత్ర) ఇచ్చాడని చెబుతారు. అది కూడా ఈ రోజు జరిగిందే! శ్రీ కృష్ణుడి బాలమిత్రుడైన సుధామ (Sudama) అతి సాధారణమైన నైవేద్యంతో కృష్ణుడిని దర్శించి, అనంత సంపదలతో తిరిగి వచ్చిన కథ కూడా మనకు తెలిసిందే. ఈ సంఘటన కూడా అక్షయ తృతీయ రోజే జరిగిందని నమ్మకం. ధర్మరాజుకు అక్షయపాత్ర దొరికింది, కుబేరుడికి లక్ష్మీ దేవి అనుగ్రహం సిద్ధించింది కూడా ఇదే రోజు అంటారు.

జైన మతంలో కూడా అక్షయ తృతీయకు విశేష ప్రాముఖ్యత ఉంది. మొదటి తీర్థంకరుడు అయిన ఋషభనాథుడు ఒక సంవత్సరం ఉపవాసం ఉండి, ఈ రోజునే చెరకు రసం తాగి ఆయన వ్రతాన్ని విరమించారని జైనులు చెబుతారు. దీనినే వారి సంప్రదాయంలో "వర్షి-టాప (Varshi-tap)" అంటారు.

* ఆచారాలు, సంబరాలు

అక్షయ తృతీయ రోజున పాటించాల్సిన ఆచారాలు, సంబరాలు ప్రాంతం, సంఘాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా ఈ రోజున చాలా పుణ్య కార్యక్రమాలు జరుగుతాయి. పేదలకు ఆహారం, ధనం లాంటివి దానం చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడం, భూమి, నగలు కొనడం లాంటి శుభ కార్యక్రమాలు ఈ రోజున చేయడం మంచిదని నమ్ముతారు.

ఇది కూడా చదవండి: వీళ్లు ఎప్పుడు ఇంతే.. ముందు అదరగొడతారు.. ఆ తర్వాత బొక్కబొర్లాపడతారు!

బంగారం సంపద, శ్రేయస్సుకు చిహ్నం కాబట్టి, ఈ రోజున కొంటే శాశ్వత సంపద వస్తుందని విశ్వసిస్తారు. నేడు దేశవ్యాప్తంగా ఉన్న నగల దుకాణాలు కొత్త డిజైన్లు, ఆఫర్లతో సిద్ధంగా ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు, అయితే గ్రహాలు మంచి స్థితిలో లేకపోతే వివాహాలు చేసుకోరు.

* సాంస్కృతిక ప్రభావం

అక్షయ తృతీయ ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు, భారతీయ సమాజంలో సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన రోజు కూడా. ఈ పండుగ వేళ ప్రజలు గతంలో చేసిన పనులను విచారించి, భవిష్యత్తు కోసం ఆశ, ఉత్సాహంతో ప్రణాళికలు రూపొందిస్తారు. మంచి పనులు చేయడం ద్వారా శాశ్వతమైన సంపద, విజయం లభిస్తాయని ఈ రోజు చాటి చెబుతుంది. దీని ద్వారా సమాజంలో సామరస్యం పెరుగుతుంది.

* ఆధునిక ప్రాముఖ్యత

చాలా మంది ఈ రోజును సామాజిక సేవా కార్యక్రమాలకు ఒక సందర్భంగా ఉపయోగించుకుంటున్నారు, నేడు ఆర్థిక సంస్థలు, మార్కెట్లలో యాక్టివిటీస్ పెరుగుతాయి. కొత్త ఖాతాలు ఓపెన్ చేస్తారు, కొత్త ఆర్థిక ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అక్షయ తృతీయ మానవ ప్రయత్నాలలో దాతృత్వం, ఆశ, శ్రేయస్సు విలువలను నొక్కి చెబుతుంది.

2024-05-08T06:36:55Z dg43tfdfdgfd