అక్షరాలకు ఆలయాన్ని కట్టి పూజలు.. ఎక్కడంటే..?

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట పరిసరాల్లో ఉన్న సవర గిరిజనులు వారు మాట్లాడుకునే సవర భాష అక్షరాలకు ఆలయాన్ని కట్టి పూజలు చేస్తూ ఉన్నారు. అక్షరాలకు ఆలయం ఏంటి? పూజలు ఏంటి అని అనుకుంటున్నారా..? దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గిరిజన ప్రాంతాల్లో ఉన్న సవరలు ఏ దేవుణ్ణి పూజించరు. కానీ, వారు మాట్లాడే సవర భాషను మాత్రం దేవునిగా కొలుస్తూ అక్షరాలకి ఆలయం కట్టి పూజిస్తున్నారు. ఆ అక్షరాలే వారికి దైవంతో సమానం. వాటికే పూజలు, పండుగలు నిర్వహిస్తూ ఉంటారు. సవర మాతృభాషను రక్షించేందుకు సవర ప్రజలు చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. మాతృభాషకు మనుగడ లేనప్పుడు ఎంత నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా వ్యర్థమేనని అంటారు ఈ గిరిజనులు.

పోడు వ్యవసాయం మరియు వేటతో జీవనం సాగించే కొన్ని పెద్ద గిరిజన తెగల్లో సవర గిరిజన తెగలు ఒకటి. సవర భాష కూడా చాలా పురాతనమైన భాష. కానీ, ఈ భాషకు లిపి లేకపోవడం వలన అంతరించిపోయే దశకు చేరుకుంది. సవర తెగకు చెందిన మంగయ్య గోమాంగో 10 ఏళ్లకు పైగా కష్టపడి ఈ సవర భాషకు లిపిని 1936లో కనుక్కోవడం జరిగింది. మారుమూల సవర పల్లెల్లో ఉన్న గిరిజనులకు భాష నేర్పించేందుకు సవర భాష లిపికి ఆలయాలను కట్టించి ఆ ఆలయాల్లో సవరలకు సెలవు దినాల్లో సవర విద్యా వాలంటీర్లు మరియు గురువుల ద్వారా సవర ప్రజలకు సవర భాష రాయడం నేర్పిస్తున్నారు.

సవర భాషలో 16 హల్లులు 8 అచ్చులు కలిపి మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. మంగయ్య గోమాంగో రాసిన 24 అక్షరాల లిపిని రాతిపై చెక్కి దానిపై గర్భగుడిని నిర్మించారు. అక్షర బ్రహ్మ ఆలయాలను సవర తెగలు వారి గూడాలలో నిర్మించుకొని అక్షరాలను పూజ చేస్తూ ఆ అక్షరాలని పిల్లలకు ముందుగా నేర్పిస్తున్నారు. మాతృభాష నేర్చుకున్నాకనే తెలుగు గాని ఇంగ్లీష్ గాని నేర్చుకునేందుకు స్కూలుకు పంపిస్తామని సవర ప్రజలు లోకల్ 18 కు వివరించారు.

ఈ అక్షరం బ్రహ్మ ఆలయాలకు అనుబంధంగా సవర భాష నేర్చుకునేందుకు మందిరాలు నిర్మించి అక్కడే ప్రజలకు విద్యాబోధన చేస్తూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో నవ్గడ గ్రామంలో అక్షర బ్రహ్మ ఆలయం ఉంది. ఇలాంటి ఆలయాలు మరికొన్ని సవర గూడెల్లో కూడా ఉన్నాయి. సవర లిపి, బాష అభివృద్ధికి కోసం ఇక్కడ వారు అక్షర బ్రహ్మ యువజన సేవా సంఘం ద్వారా విద్యా వలంటీర్లు నిర్మించి సవర గూడెంలో పిల్లలకు సెలవు దినాల్లో భాషను నేర్పించి భాష అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు.

2024-09-16T15:06:39Z dg43tfdfdgfd