అసలు పెదవులు ఎందుకు పగులుతాయో తెలుసా?

పెదవులు పగిలినప్పుడు చాలా మంది లిప్ బామ్ పెడితే సరిపోతుందని అనుకుంటారు. నిజానికి పెదవులు పగలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎండకాలంలో పెదవులు పగలడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

శీతాకాలంలో పొడి గాలి పెదవులు పగలపడం సర్వసాధారణం. కానీ సాధారణ పరిస్థితుల్లో కూడా పెదవులు పగిలిపోతే మాత్రం దాన్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా పెదవులు పగులుతుంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. శరీరంలో పోషకాలు లోపించినప్పుడు కూడా పెదవులు పగిలే అవకాశం ఉంది. మరి మన శరీరంలో ఏయే పోషకాలు తగ్గితే పెదవులు పగులుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పెదవుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే చల్ల గాలి, సూర్యరశ్మి వల్ల కూడా పెదవులు పగులుతాయి. అలాగే శరీరం అంతర్గత పరిస్థితులు కూడా దానిపై ప్రభావం చూపుతాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా పెదవులు ఎక్కువగా పగులుతుంటాయి. 

 

విటమిన్ బి

విటమిన్ బి లోపం వల్ల కూడా మన పెదవులు పగులుతుంటాయి. నవ్వుతున్నప్పుడు నోటి మూలల్లో పగుళ్లు కనిపిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా విటమిన్ బి లోపం ఉన్నట్టేనంటున్నారు నిపుణులు. విటమిన్ బి అనేది నీటిలో కరిగే విటమిన్ల సమూహం. ఇవి శరీరంలోని వివిధ కార్యకలాపాలకు అవసరం. మీ శరీరంలో ఈ బి విటమిన్లు లేకపోతే మీ పెదవులు పొడిబారుతాయి. విటమిన్ బి-12 లోపం వల్ల పెదవుల పగుళ్లు, బొబ్బలు ఏర్పడతాయి.

మాంసాహారుల కంటే శాఖాహారులకే విటమిన్ బి-12 లోపం ఉంటుంది. ఎందుకంటే విటమిన్ బి -12 ప్రధానంగా మాంసంలోనే కనిపిస్తుంది. కొంతమొత్తంలో పాల ఉత్పత్తులు, గింజలు, ఆకుకూరల్లో కూడా ఉంటుంది. కానీ వీటిని మన శరీరం అంత సులువుగా గ్రహించదు. అందుకే మీరు డాక్టర్ ను సంప్రదించి సప్లిమెంట్లను తీసుకోవచ్చు. 

విటమిన్ సి

విటమిన్ సి లోపం వల్ల కూడా జుట్టుకు, చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. విటమిన్ సి కూడా మన పెదవులకు ఎంతో అవసరమైన పోషకం. అందుకే మీ శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే పెదవులు పొడిబారుతాయి. పగుళ్లు వస్తాయి. నారింజ, టాన్జేరిన్లు, నిమ్మకాయలు, ద్రాక్ష, టమోటాలు, బంగాళాదుంపలు, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్ వంటి సిట్రస్ పండ్లను తింటే విటమిన్ సి అందుతుంది. 

 

జింక్

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో జింక్ ఒకటి. ఇది మన పెదవులను ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు జింక్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని మిగిలిన భాగాలతో పాటుగా పెదవులు ఆరోగ్యంగా ఉండటానికి జింక్ సరఫరా అవసరం. జింక్ మాంసం, చేపలతో పాటు చిక్కుళ్లు, తృణధాన్యాలలో మంచి మొత్తంలో లభిస్తుంది. 

ఇనుము

శరీరంలో ఇనుము లోపిస్తే కూడా పెదవులు పగిలిపోతాయి. అయితే పగిలిన పెదవులు కొన్ని రక్తహీనత సమస్యకు సంకేతంగా భావించాలి. సాధారణంగానే ఆడవాళ్లలోనే ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆడవాళ్లకే పెదవులు ఎక్కువగా పగులుతాయి. విటమిన్ బి 12 మాదిరిగా శాకాహారులలో ఇనుము లోపం కూడా ఎక్కువగా ఉంటుంది.  బచ్చలికూర, బ్రోకలీ వంటి కూరగాయలలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. కానీ వీటిలో ఉండే ఫైటేట్లు ఇనుము శోషణను నిరోధిస్తాయి. కూరగాయలు, పండ్లు, చిక్కుళ్లు, టీ, కాఫీ, వైన్లలో ఉండే పాలీఫెనాల్స్ ఇనుము శోషణను నిరోధిస్తాయి.

2024-03-29T05:30:35Z dg43tfdfdgfd