ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినాలని ఎందుకు అనిపిస్తుంది?

కడుపు నిండిన తర్వాత కూడా రుచి బాగుందంటూ మరింత తిన్నారా?

అలా చేయడం వల్ల మీకు తృప్తిగా, సంతోషంగా అనిపించిందా?

అయితే, మీరు కూడా ఒక అనారోగ్యకర అహారపు అలవాటులో చిక్కుకున్నట్లే.

ఈ అలవాటునే ‘హెడోనిక్ ఈటింగ్’ అని పిలుస్తున్నారు.

ఆకలి వేయకున్నా, ఆనందం కోసం ఏదో ఒకటి తినే అలవాటుని హెడోనిక్ ఈటింగ్‌ అని నిపుణులు అభివర్ణిస్తున్నారు.

హెడోన్ అనే గ్రీకు పదం నుంచి ‘హెడోనిక్ ఈటింగ్’ అనే పేరు వచ్చింది.

హెడోన్ అంటే ఆనందం లేదా ఆహ్లాదం అని అర్థం.

హెడోనిక్ ఆకలి అంటే ఏంటి?

మనం తినే ఆహారం, తాగే పానీయాల నుంచి వచ్చే కేలొరీలు, శక్తితో మన శరీరం పనిచేస్తుంటుంది.

మనం తీసుకున్న కేలొరీల కంటే ఎక్కువ కేలొరీలను ఖర్చు చేసినప్పుడు మనకు ఆకలిగా అనిపిస్తుంది.

కడుపు ఖాళీ అయినప్పుడు మన పొట్టలో ఉండే హార్మోన్ వ్యవస్థ ఆ విషయాన్ని మెదడుకు చేరవేస్తుంది. అలా మనకు ఆకలి వేస్తుంది.

దీన్ని సాధారణంగా శారీరక ఆకలి లేదా ఫిజికల్ హంగర్ అని పిలుస్తారు.

హెడోనిక్ హంగర్ లేదా హెడోనిక్ ఆకలి అంటే, మనకు ఆకలిగా లేకపోయినప్పటికీ కేవలం ఆనందం కోసమే ఏదైనా తినాలనే కోరిక కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

‘‘దాదాపు ప్రతీఒక్కరికీ హెడోనిక్ ఈటింగ్ అలవాట్లు ఉంటాయి. కొంతమందికి ఆహారం చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది’’ అని యూకేలోని లీడ్స్ యూనివర్సిటీ అపటైట్ అండ్ ఎనర్జీ బ్యాలెన్స్ ప్రొఫెసర్ జేమ్స్ స్టబ్స్ అన్నారు.

ఆనందమే కాకుండా భావోద్వేగాలు, ఒత్తిడి, అసౌకర్యం వంటి ఇతర అంశాలతో మన ఆహారపు అలవాట్లు ముడిపడి ఉంటాయని ప్రొఫెసర్ స్టబ్స్ అభిప్రాయపడ్డారు.

అయితే, ఆహారం ద్వారా ఆనందం పొందడానికి ఇలా తినేవాళ్లంతా ఆకుకూరలు లేదా క్యాబేజీ సలాడ్ లేదా మొలకెత్తిన ధాన్యాలను తింటారా? అంటే బహుశా అవి తినరనే చెప్పాలి.

‘‘మనకు సాధారణంగా కొవ్వులు, ఉప్పు, చక్కెర పాళ్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలే నచ్చుతాయి. ఎందుకంటే, అవి ఎక్కువ శక్తిని ఇస్తాయి’’ అని లివర్‌పూల్ యూనివర్సిటీ అపటైట్, ఒబెసిటీ రీసెర్చ్ గ్రూప్ పరిశోధకులు, లెక్చరర్, డాక్టర్ బేథమ్ మీడ్ అన్నారు.

‘‘ఈ ఆహారాలు అందించే శక్తి, వాటిని తినడం వల్ల మనం పొందే ఆనందం కారణంగా మనం వాటిపట్ల ఆకర్షితులం అవుతున్నాం. అయితే, మనకు ఈ భావన ఫిజికల్ హంగర్ వల్ల కలుగుతుందా? లేక హెడోనిక్ హంగర్ వల్ల కలుగుతుందా? అని చెప్పడం కష్టం’’ అని ఆయన వివరించారు.

ఒబెసిటీ ముప్పు

కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక పాళ్లలో ఉండే ఆహారాలు ఎక్కువగా అందుబాటులో ఉండటం కూడా హెడోనిక్ ఈటింగ్‌కు దారితీసే కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

హెడోనిక్ ఈటింగ్ అలవాటు కారణంగా అనారోగ్యకర ఆహారాలు తినడం వల్ల ఒబెసిటి ముప్పు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

‘‘ఈరోజుల్లో మనకు ఎక్కడ చూసినా చాలా రుచికరమైన, సులభంగా లభించే, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలు అందుబాటులో ఉన్నాయి.

ఇది బరువు పెరగడానికి అనుకూల వాతావరణం. భూమ్మీద ప్రస్తుతం ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఒబెసిటీతో ఉన్నారు. ఇందులో ఆశ్చర్యం లేదు’’ అని స్టబ్స్ అన్నారు.

మనం ఏం చేయాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆనందం కోసం తినడం తప్పు కాదు. కానీ, అతిగా తినడం, తిండిని వ్యసనంగా మార్చుకోవడం వల్ల ఒబెసిటీ వచ్చే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

తుర్కియేలో చేసిన ఒక అధ్యయనం హ్యుమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే జర్నల్‌లో 2024 జనవరిలో ప్రచురితమైంది. ఇది ఒబెసిటీతో ఉన్న వయోజనుల్లో హెడోనిక్ హంగర్‌ గురించి విశ్లేషించింది.

అధిక బరువు ఉన్న వారిలో హెడోనిక్ హంగర్ పెరగడం వల్ల అత్మస్థైర్యం తగ్గడంతో పాటు బరువు గురించి ప్రతికూల భావాలు పెరిగినట్లు గుర్తించారు.

హెడోనిక్ ఈటింగ్ కారణంగా అతిగా తినడాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి?

‘‘మనం బరువు తగ్గినప్పుడు హెడోనిక్ హంగర్ కూడా తగ్గుతుందని పరిశోధనలో తెలిసింది’’ అని డాక్టర్ మీడ్ అన్నారు.

‘‘ప్రయత్నం మీద బరువు తగ్గినవారు అలాంటి ఆహారాలకు స్పందించే తీరులో మార్పు రావడం వల్ల ఇలా జరుగుతుండొచ్చు’’ అని ఆయన చెప్పారు.

బరువు తగ్గడం, కొత్త ఆహార అలవాట్లు చేసుకోవడం, కొత్త ఆరోగ్యకర జీవన విధానాన్ని అవలంభించడం చాలామందికి అంత సులువు కాదు. కానీ, దీన్ని ఆనందకర అలవాటుగా మార్చుకోవడానికి ఒక మార్గం ఉందని ప్రొఫెసర్ స్టబ్స్ చెప్పారు.

‘‘ఉదాహరణకు మీరు శారీరక శ్రమను పెంచుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవాలంటే ఏ పని చేస్తే మీకు ఎక్కువ ఆనందం కలుగుతుందో ఆలోచించుకోండి. జిమ్‌కు వెళ్లడం మీకు నచ్చుతుందా? లేక స్నేహితులతో కలిసి వాకింగ్ చేయడం లేదా డాన్స్ చేయడం వంటివి ఎంచుకోండి.

మీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని కలిగించే అంశాలేంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటి ప్రకారం, కొత్త అలవాట్లు, కొత్త ఆరోగ్యకర జీవనాన్ని అలవాటు చేసుకోవచ్చు’’ అని ఆయన చెప్పారు.

హెడోనిక్ ఈటింగ్ లేదా అతిగా తినడాన్ని నివారించడానికి ‘మైండ్‌ఫుల్ ఈటింగ్’ ఒక మార్గం కావొచ్చు.

‘‘మేం ప్రజలకు ఉన్న హెడోనిక్ ఈటింగ్ అలవాటును ఆపాలని అనుకోవట్లేదు. కానీ, ఆ అలవాటును మరిత ఆరోగ్యకర ఆహారపు అలవాటుగా మార్చాలనుకుంటున్నాం’’ అని స్టబ్స్ అన్నారు.

రుచికరమైన ఆహారపదార్థాలు ఇచ్చే ఆనందాన్ని కోల్పోకుండా ఆరోగ్యకర ఆహారం తినడాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో ఆయన వివరించారు.

‘’80:20 లైఫ్ స్టయిల్‌కు మీరు మారొచ్చు. అంటే మీరు తక్కువ కేలోరీలు, పుష్కలంగా పోషకాలు ఉన్న ఆహారపదార్థాలను 80 శాతం తింటూ, 20 శాతం మీకు ఆనందాన్ని ఇచ్చే ఆహారపదార్థాలను తినాలి’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-05-07T04:17:03Z dg43tfdfdgfd