ఇది కదా అద్భుతం.. మగ జీవి సాయం లేకుండా పిల్లకు జన్మనిచ్చిన ఆడ మొసలి.. ప్రపంచలోనే తొలిసారి

మనిషి, జంతువు, పక్షి.. ఇలా జీవి ఏదైనా సరే సంపర్కం జరగనిదే పిల్లలకు జన్మ ఇవ్వడం సాధ్యం కాదనే భావన దాదాపు అందరిలో ఉంటుంది. అయితే అది తప్పు అని ఇప్పటికే కొన్ని రకాల పక్షులు, చేపలు, బల్లులు వంటి కొన్ని జీవులు నిరూపించాయి. కాగా తాజాగా కోస్టా రికాలో (Costa Rica) మరో ఆశ్చర్యపరిచే జీవసంబంధమైన ఘటన జరిగింది. ఒక ఆడ మొసలి (Female crocodile), మగ జీవి తోడు లేకుండానే గుడ్లు పెట్టింది. సుమారు 16 ఏళ్లుగా మగ మొసళ్లతో లైంగికంగా సంబంధం పెట్టుకోని ఈ ఆడ మొసలి వర్జిన్ బర్త్ ఇచ్చిందని, ఇలా జరగడం ప్రపంచంలోనే తొలిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

క్రోకోడైలస్ అక్యుటస్ (Crocodylus acutus) అని పిలిచే ఈ ఆడ అమెరికన్ మొసలిని 2002లో కోస్టారికా దేశంలోకి తీసుకొచ్చి ఒక జూలో పదహారేళ్లుగా ఉంచారు. ఈ సమయంలో ఇది ఏ ఇతర మొసలితోనూ కలవకుండా ఒంటరిగా నివసించింది. అయినా 2018, జనవరిలో దీని ఎన్‌క్లోజర్‌లో 14 మొసలి గుడ్లు కనిపించినట్లు జూకీపర్స్ తెలిపారు. దురదృష్టవశాత్తు, ఈ గుడ్లలో ఒక్కటి తప్ప ఏవీ పొదగలేదు. ఆ ఒక్క గుడ్డు లోపల పూర్తిగా అభివృద్ధి చెందిన, పుట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక మొసలి పిల్లను కనుగొన్నారు. ఈ మొసలి పిల్ల దాదాపు తన తల్లిని పోలి ఉంది.

శాస్త్రవేత్తలు జన్యువులను పరిశీలించినప్పుడు, మొసలి పిల్ల దాని తల్లితో 99.9% జన్యుపరంగా ఐడెంటికల్‌గా ఉన్నట్లు తేలింది. అంటే ఆ మొసలి పిల్ల తన తల్లి నుంచి దాదాపు 100% జన్యు సమాచారాన్ని పొందింది. శాస్త్రవేత్తలు మొసలి పిల్ల గుండె, తల్లి చర్మాన్ని అధ్యయనం చేసి వాటి జన్యు సమాచారం దాదాపు 99.9% సరిపోలికలతో సమానంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరీక్ష ద్వారా మొసలి పిల్లకు తండ్రి లేదని వారు నిర్ధారించారు.

ఇది కూడా చదవండి : చాట్‌జీపీటీ పుణ్యమాని టెక్ కాపీరైటర్ ఉద్యోగం ఫసక్.. చివరికి డాగ్ వాకర్‌గా మారిన ఉద్యోగి..

బయాలజీ లెటర్స్ (Biology Letters) జర్నల్‌లో ఈ ఆవిష్కరణను ప్రచురించారు. దీని పట్ల శాస్త్రవేత్తలు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది కాలక్రమేణా జంతువులు ఎలా అభివృద్ధి చెందాయనే దాని గురించి కొన్ని ఆసక్తికరమైన అవగాహన ఇస్తుందని వారు భావిస్తున్నారు. ఆడ మొసలికి మగ తొడ లేకుండా పిల్లలు పుట్టే ఈ సామర్థ్యం గతంలో డైనోసార్ల వంటి జంతువులు ఉన్న సమయంలో కూడా ఉండి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు.

* మగ జీవి ప్రమేయం లేకుండా పిల్లలు కనడం

కొన్నిసార్లు కొన్ని జంతువులు తండ్రి అవసరం లేకుండా పిల్లలను కంటాయి. దీనిని "కన్య జననం (Virgin birth)" లేదా "ఫ్యాకల్టేటివ్ పార్థినోజెనిసిస్ (Facultative parthenogenesis)" అంటారు. ఈ పద్ధతిలో మగ జీవి స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందకుండా అండం శిశువుగా మారుతుంది. ఇది గతంలో కొన్ని రకాల పక్షులు, చేపలు, బల్లులు, పాములలో కనిపించింది, కానీ మొసళ్ళలో ఈ వింత పుట్టుక ఇప్పటివరకు కనిపించలేదు. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ ప్రక్రియలో మగ జీవి సహకారం అవసరం లేకుండానే ఆడ జీవిలో అండం దానంతట అదే పిండంగా అభివృద్ధి చెందుతుంది.

2023-06-08T07:02:01Z dg43tfdfdgfd