ఎక్కువ నీళ్లు ఉండే సరైన కొబ్బరి బొండాలను గుర్తించే అద్భుత చిట్కాలు..

సమ్మర్‌ మొదలైపోయింది. రోజు రోజుకూ ఎండల ప్రభావం పెరుగుతోంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తీవ్రమైన వేడి, ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చక్కటి ఉపశమనం కోసం అందరూ రీఫ్రెష్ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు తక్షణ ఉపశమనం అందిస్తాయి, వేడి తాపాన్ని చల్లబరుస్తాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి.
చలువ ప్రయోజనాలు ఉండటంతో వేసవిలో కొబ్బరి బొండాలకు డిమాండ్ పెరుగుతుంది. ధర ఎక్కువగా ఉన్నా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని కొబ్బరి బొండం కొనుగోలు చేస్తే, కొన్ని సందర్భాల్లో నీరు తక్కువగా ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే సమయంలో కొన్ని అంశాలను పరిశీలించాలి. తాజా, హైడ్రేటింగ్ కొబ్బరి నీళ్లను అందించే కొబ్బరి బొండాలను గుర్తించాలంటే కొనుగోలు సమయంలో పరిశీలించాల్సిన అంశాలివే.

బాగా షేక్ చేయండి

సాధారణంగా ఏవైనా టానిక్స్ తాగే ముందు వాటిని బాగా షేక్ చేస్తుంటాం. ఇదే సూత్రం కొబ్బరి బొండాలకు వరిస్తుంది. కొనుగోలుకు ముందు కొబ్బరి బొండాలను బాగా షేక్ చేయాలి. ఈ సమయంలో ఫిజ్ అనే ధ్వని వస్తుంటంటే అందులో నీరు శాతం తక్కువగా ఉన్నట్లు. ఒకవేళ ఎలాంటి శబ్ధం రాకపోతే కొబ్బరి బొండంలో నీరు పుష్కలంగా ఉందని అర్థం. మీరు కొబ్బరి బొండం కొనుగోలు చేసే సమయంలో ఇలా షేక్ చేయడం మర్చిపోవద్దు.

ఆకుపచ్చ రంగు

కొబ్బరి బొండాలను కొనుగోలు చేసేటప్పుడు వాటి రంగులను పరిశీలించాలి. కొన్నిటిపై ముదురు గోధుమ రంగు మచ్చలు కనబడుతుంటాయి. అంటే అవి త్వరలో పరిపక్వత చెందాయి అని అర్థం. వీటిలో నీరు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పరిపక్వత ప్రక్రియను అవి వేగవంతం చేస్తాయి. అందుకే కొనుగోలు సమయంలో ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు ఉన్న కొబ్బరి బొండాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వాటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది.

పరిమాణం

సాధారణంగా భారీ పరిమాణంలో ఉండే కొబ్బరి బొండాల్లో నీరు ఎక్కువగా ఉంటుందని చాలా మంది భ్రమపడుతుంటారు. నిజానికి చిన్న కొబ్బరి బొండాల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. చిన్న కొబ్బరి బొండాలు గుండ్రంగా ఉండి సిలిండర్‌ను పోలి ఉంటాయి.

వ్యక్తిగత ఎంపిక

కొనుగోలు చేసే సమయంలో కొందరు లేత కొబ్బరి గుజ్జు ఉండే కొబ్బరి బొండాలను ఎంపిక చేసుకుంటారు. ఈ రకమైన కొబ్బరి రుచికి కొంచెం తియ్యగా ఉంటుంది. అయితే ఈ కొబ్బరి బొండాల్లో నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. అందుకు ఎంపిక అనేది మీ వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా ఉండాలి.

త్వరగా తాగేయడం మేలు

కొబ్బరి బొండం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే తాగడం ఉత్తమం. తాజా కొబ్బరి నీళ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కొబ్బరి బొండం వినియోగంలో ఆలస్యం చేస్తే పోషకాలు తగ్గుతాయి. అందుకే ఎంత త్వరగా తాగితే అంత మంచిది.

2024-03-27T08:16:38Z dg43tfdfdgfd