చీమ తెలివి

ఓ పల్లెటూరి విద్యార్థి మంచి మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఉన్నత చదువుల కోసమని వసతి గృహంలో చేరడానికి పట్నానికి బయల్దేరాడు. వెళ్తూ తల్లి దగ్గర ఆశీస్సులు అందుకున్నాడు. ‘అమ్మా! నేను పుట్టినప్పటి నుంచి ఊరు దాటింది లేదు. ఇక్కడే పుట్టి, పెరిగాను. ఈ వీధుల్లోనే తిరిగాను. పట్నం నాకు కొత్త. ఎలా మెలగాలో తెలియడం లేదు’ అని వాపోయాడు కొడుకు. ‘మంచివారితో స్నేహం చేస్తే చాలు నాయనా! నువ్వు అనుకున్న లక్ష్యం సాధిస్తావు. అదే చెడు సావాసం చేస్తే నష్టపోతావు’ అని హెచ్చరించింది. ‘ఎవరు మంచివాళ్లో, ఎవరు చెడ్డవాళ్లో గుర్తించడం ఎలా? దానికి నేనేం చేయాలి?’ అని ప్రశ్నించాడు కొడుకు. అప్పుడు తల్లి.. గోడవారగా వెళ్తున్న చీమల బారును చూపించి ‘ఈ చీమంత తెలివి ఉంటే ఏ చీకూచింతా లేకుండా లోకమంతా చుట్టి రావొచ్చు’ అని ధైర్యం చెప్పింది.

ఆశ్చర్యంగా తల్లి వంక చూశాడు కొడుకు. వెంటనే ఆమె కాస్త చక్కెర తెచ్చి చీమల ముందుపోసింది. చకచకా వచ్చిన చీమలు చక్కెర ముక్కల్ని గబగబా తీసుకుని వెళ్లాయి. ఆ తర్వాత ఆమె… చక్కెర, ఉప్పురాళ్ల ముక్కలు కలిపి చీమల ముందర చల్లింది. చీమలు చక్కెర ముక్కల్ని మాత్రం తీసుకెళ్లి ఉప్పురాళ్ల ముక్కల్ని అక్కడే వదిలేశాయి. చీమలు చేస్తున్న పనిని కొడుక్కు చూపుతూ.. ‘లోకమనేది మంచి చెడ్డల కలయిక.

ఎక్కడికి వెళ్లినా.. మంచీ, చెడూ రెండూ ఉంటాయి. నీవు చేయాల్సినదంతా చీమలు చక్కెరను, ఉప్పును విడదీసినట్లు మంచి, చెడ్డ స్నేహితులను గుర్తించు. కళాశాలలో కొత్తగా స్నేహితులు పరిచయం అవుతారు. వారి నేపథ్యాలు, అభిరుచులు విభిన్నంగా ఉంటాయి. కాబట్టి వారిని కొన్నాళ్లపాటు జాగ్రత్తగా గమనించు. మంచివారు అనిపిస్తేనే వారితో స్నేహం చెయ్‌! చెడ్డవారిని దూరం పెట్టు!’ అని సలహా ఇచ్చింది. ఆ మాటలతో విద్యార్థి ముఖం వెలిగిపోయింది. ‘అలాగే అమ్మా!’ అని తల్లి ఆశీస్సులు తీసుకొని పట్నం బయల్దేరాడు.

– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821

2024-09-15T20:43:51Z dg43tfdfdgfd