చేతివృత్తుల నైపుణ్యానికి.. వెదురు ఉత్పత్తులు ఎంతో ఉపయోగకరం..

వెదురు గడ అనే మొక్కలు మానవ గృహ అవసరాలు, నిర్మాణాలకు అత్యధికంగా వినియోగించు వృక్షజాతి. వెదురు ఆసియా దేశాలలో ఉష్ణ ప్రదేశాలలో నిటారుగా పెరిగే గడ్డి జాతికి చెందినది. వెదురులో 75 జాతులు, వెయ్యికి పైగా రకాలు ఉన్నాయి. వెదురుకు భూమిలో తేమ అవసరం. నీరు లేని చోట్ల వెదురు పెరగదు. వెదురు మానవులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇల్లు కట్టుకోవడానికి, బల్లలు, కుర్చీలు, నిచ్చెనలు, గంపలకు మొదలగు ఉపకరణాలకు విశేషంగా వినియోగిస్తున్నారు. వైద్య సంబంధిత కార్యక్రమాలకు వెదురు చాలా ఉపయోగపడుతుంది. ఇలా వెదురుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి.

వరంగల్ నగరంలో నడిరోడ్డుపై కొలువు తీరిన వెదురు ఉత్పత్తులు చేతివృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. వెదురుతో వివిధ ఆకృతిలో ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్పత్తులు అందానికి, వైవిధ్యానికి పట్టం కడుతున్నాయి. తయారీతో పాటు అందం, నైపుణ్యం ఉండటంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ సమీపంలో ఫుట్‌పాత్‌పై రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన చేతివృత్తిదారులు జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి ఫుట్‌పాత్‌పైనే వీటిని తయారుచేసి అమ్ముతున్నారు. కుర్చీలు, సోఫాలు, గంపలు ఇలాంటివి ఆకృతిలో తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. వీటిని విభిన్నమైన రీతిలో తీర్చిదిద్దడంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నగరంలో ఫర్నీచర్స్ షాప్స్ ఎన్ని పుట్టుకొస్తున్నా చేతివృత్తిదారులు కూడా వాటికి దీటుగా తమ కలలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన చేతివృత్తిదారుడు నేమిచంద్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఫుట్‌పాత్‌పై తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన వెదురుతో వెరైటీ కుర్చీలు, సోఫాలు, రకరకాల అల్లికల కుర్చీలను తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. చిన్న, పెద్ద కుర్చీలు, సోఫాలు ఇవన్నీ అల్లుతామని వ్యాపారి నేమిచంద్ 'లోకల్ 18'కు వివరించారు. ''వీటి తయారీకి ఈ వెదురు మొత్తం రాజస్థాన్ నుంచే తెప్పిస్తాం. వీటితో కుర్చీలు, సోఫాలతో పాటు పలు రకాలుగా తయారు చేస్తాం. అదేవిధంగా కస్టమర్ ముందుగా ఆర్డర్ చేస్తే తాము చూపించిన విధంగా కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది.''

వీటి ధరలు రూ.450 నుంచి మొదలై రూ.2వేల వరకు ఉంటాయన్నారు. పరికరాన్ని బట్టి వీటి ధరలు ఉన్నట్లు చెప్పారు. నిత్యం పదుల సంఖ్యలో కస్టమర్స్ వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ''వీటిపై కాస్త డిస్కౌంట్ కూడా అందజేస్తున్నాం'' అని తెలిపారు. ప్రజలను ఆకట్టుకునే రీతిలో చేతివృత్తిదారులు అద్భుతమైన పరికరాలను తయారు చేస్తున్నారని ఇక్కడికి వచ్చే ప్రజలు చెబుతున్నారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకున్నవారమవుతామని చెప్పారు. ప్లాస్టిక్ చైర్స్ కొనుగోలు చేయడం ద్వారా కొంతకాలం తర్వాత వాటిని బయట పడేయడం ద్వారా అవి భూమిలో చేరి పర్యావరణం దెబ్బతింటుంది. అదే ఈ వెదురుతో తయారు చేసిన పరికరాల ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. పైగా ప్లాస్టిక్ పరికరాలతో పోలిస్తే వీటి ధరలు కూడా కాస్త తక్కువే ఉన్నాయి.

అదేవిధంగా ఈ కుర్చీలు, సోఫాలు వినియోగించడం ద్వారా మన ఇల్లు కూడా అద్భుతంగా కనిపిస్తుంది. వ్యాపారులు తమ జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి ఈ పరికరాలను తయారు చేస్తూ జీవిస్తున్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే ఈ వస్తువులను తయారు చేస్తున్న వ్యాపారులను అధికార యంత్రాంగం గుర్తించి వారికి వసతి సదుపాయం కల్పించాలని కోరారు.

2024-09-16T12:36:37Z dg43tfdfdgfd