జుట్టుకు ఆరోగ్యం పట్టిద్దాం

కాలం ఏదైనా జుట్టు సమస్యలు సర్వసాధారణం. అయితే, వర్షాకాలం ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. వర్షంలో తడవడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. కురులు నిగారింపు కోల్పోతాయి. కుదుళ్లు బలంగా ఉన్నప్పుడే కురులు అందంగా కనిపిస్తాయి. పై పూతలకన్నా… ఆహారంలో మార్పుచేర్పుల వల్ల జుట్టు సమస్యలను దూరం చేయవచ్చు.

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో మెంతులు కీలకపాత్ర పోషిస్తాయి. ఆహారంలో మెంతులపొడిని భాగంగా చేసుకోవాలి. కేశ సంరక్షణలో మెంతులను ప్రత్యక్షంగా ఉపయోగించొచ్చు. కొబ్బరినూనెలో కొన్ని మెంతులు వేసి వేడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఆ నూనెను తలకు పట్టించి రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి ఒకటి రెండుసార్లు ఇలా చేయడం వల్ల కురులు బలంగా తయారవుతాయి.

ఆలివ్‌ గింజలు తినడం వల్ల జుట్టు సమస్యల నుంచి త్వరగా బయటపడచ్చు. కొన్ని ఆలివ్‌ గింజలను నీటిలో నానబెట్టుకోవాలి. ఈ గింజలను రాత్రి పడుకునే ముందు పాలతోపాటు తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌, కొబ్బరి, నెయ్యితో ఈ ఆలివ్‌ గింజలను కలిపి లడ్డూలు చేసుకోవచ్చు. ఇవి తింటే శరీరానికి అవసరమైన ఐరన్‌ అందుతుంది. కుదుళ్లకూ పటుత్వం వస్తుంది.

జాజికాయ జుట్టు సమస్యలను దూరం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పాలతో ఆలివ్‌ గింజలు తీసుకునే వారు జాజికాయ పొడిని కలుపుకొని తాగొచ్చు. జాజికాయలో ఉండే విటమిన్‌ బి6, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. కేశాలను దృఢంగా మారుస్తాయి

నెయ్యి, పసుపు, పెరుగు కూడా జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. రోజువారీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే.. మీ జుట్టుకు అదనపు పోషణ అందినట్టే!

టాప్‌ టిప్‌

  • నీటి మంత్రం

శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే అందంగా కనిపిస్తారు. శరీరానికి అవసరమైన నీరు అందితే చర్మంతోపాటు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మం నిగారిస్తుంది. కాంతిమంతంగా తయారవడమే కాకుండా అలర్జీలు కూడా దూరమవుతాయి.

  • ఆవిరి తంత్రం

ముఖం తాజాగా కనిపించాలని కోరుకునే వారు వారానికి ఒకసారైనా ఆవిరి పట్టుకోవాలి. ముఖానికి ఆవిరి పట్టడంతో ముడుచుకుపోయిన స్వేదగ్రంధులు తెరుచుకుంటాయి. చర్మంపై ఉండే మృతకణాలు, దుమ్ము తొలగిపోయి ముఖ వర్చస్సు పెరుగుతుంది.

2024-07-25T23:30:42Z dg43tfdfdgfd