పేకాట పురాణం

చాలారోజుల వరకూ పేకాట గురించి నాకు అస్సలు తెలియదు. అలాంటిదొక ఇండోర్‌ గేమ్‌ ఉన్నదనీ, దానికో ప్రత్యేక పరిభాష కూడా ఉంటుందనీ తెలిసే అవకాశం మా ఇంట్లో ఉండేది కాదు. ఎండకాలం సెలవుల్లో మా నానమ్మవాళ్ల ఊరికి వెళ్లినప్పుడు అక్కడ మొదటిసారి పేకాట చూశాను.

మధ్యాహ్నం భోజనాలు కాగానే ఐదారుగురు మగవాళ్లు ఓ జంపఖానా పరిచి.. కూర్చొని పేకాట మొదలుపెట్టేవాళ్లు. ఇద్దరు బావలు, ఇద్దరు అన్నలు, మా చిన్న చిన్నాయనతోబాటు మా తాతయ్య కూడా ఆడేవాడు. ‘రమ్మీ’ ఆటను ఎక్కువగా ఆడేవాళ్లు. ఆ ఊర్లో మా దగ్గరి బంధువుల ఇళ్లే పన్నెండుకు పైగా ఉండేవి. “మీ ఇంట్ల సందడి మస్తు జోరుగుంటది!” అంటూ.. మరో నలుగురైదుగురు కూడా వీళ్లతో కలిసేవారు. వాళ్లు అప్పుడప్పుడూ డబ్బులు పెట్టి ఆడేవారనుకుంటా! ఎవరైనా వచ్చి కూచునేటప్పుడు.. “పైసలున్నయా!? ఉద్దెరనా?!” అని అడిగేవారు. “ఎహె! తెచ్చుకున్న!” అంటూ, ఆ వచ్చినాయన మోచేతుల దాకా ముడుచుకున్న తన కమీజు/షర్ట్‌ మడతలు విప్పి.. అందులోంచి రూపాయో, రెండు రూపాయలో, ఐదు రూపాయల నోటో తీసేవాడు. అందరికీ తెలుస్తుందనో ఏమో.. డబ్బులను జేబులో కాకుండా షర్ట్‌ మడతల్లో పెట్టుకునేవారు. అలా డబ్బులు తీసి మధ్యలో పెట్టాకే.. ఆయనకు కార్డ్స్‌ వేసేవారు. ఇక సాయంత్రం టైంకి చాయ్‌, ఏవైనా స్నాక్స్‌ అక్కడికి తెచ్చి ఇవ్వాల్సిందే! మధ్యమధ్య మా చిన్నాయనొక్కడూ బయట గోడ పక్కగా వెళ్లి.. దొంగతనంగా సిగరెట్‌ తాగి వస్తుండేవాడు. ఆ ఖాళీ అట్టడబ్బా కోసం మేము పోటీపడేవాళ్లం.

ఎండపూట బయటికి వెళ్లొద్దనే నిబంధన ఉండటం వల్ల మేము అప్పుడప్పుడూ ఈ పేకాట బ్యాచ్‌ చుట్టూ కూచునేవాళ్లం. అలా అని వాళ్లు ఇరవై నాలుగ్గంటలూ ఆడేవాళ్లు కాదు. “మీరెందుకిక్కడ? బయటికి పోండి” అని మమ్మల్ని వారించిందీ లేదు. అలా చూసీచూసీ మాకు పేకాటపై ఓ అవగాహన ఏర్పడింది.

మొత్తం పేకముక్కల్లో రెండు జతలుంటాయనీ, ఒక్కో జతలో డైమండ్‌, ఆఠీను, ఇస్పేటు, కళావరు అని నాలుగు గుర్తులుంటాయనీ, ఒక్కో గుర్తుకూ పదమూడు ముక్కలుంటాయనీ, ఒకటి నుంచి పది వరకూ నెంబర్లు, ఆ తరువాత ఇంగ్లిష్‌ అక్షరాలు జే, క్యూ, కే, ఏ (యువరాజు జాకీ, క్వీన్‌ రాణి, కింగ్‌ రాజు, ఏస్‌కు ఏ) గుర్తులుంటాయనీ తెలిసింది. ముక్కలు కలపడం ఒక ప్రత్యేక కళ. దానిని ‘పిసాయించుడు’ అనేవారు.

అప్పుడప్పుడూ వాళ్లు ‘అడ్డు – షరతు’ అనే ఆట ఆడేవాళ్లు. ఈ ఆటలో తొమ్మిది నుంచి ఏ వరకే కార్డ్స్‌ పంచేవారు. అందులో ఇస్పేటు గుర్తుకు ఎందుకో మరి.. చాలా విలువ. రెండు జట్లుగా ఏర్పడి గుండ్రంగా ఒకరిని విడిచి ఒకరు ఒక్కో జట్టుగా కూచునేవారు. అంటే మన రెండు పక్కలా ప్రత్యర్థి జట్టు వాళ్లుంటారన్నమాట. పేకాటలోకి మా రంగప్రవేశం ఇక్కడే జరిగింది. వాళ్లకు అప్పుడప్పుడూ జట్టుకు సరిపడా మనుషులు దొరకనప్పుడు మమ్మల్ని కూర్చోమనేవారు. నిజానికి మమ్మల్ని తాతయ్యే పిలిచేవారు. “అయ్యో.. నాకేం తెల్వదు!” అని మొత్తుకున్నా వినకుండా.. “ఏం గాదు.. మేము నేర్పుతం గద!” అని అభయమిచ్చి.. ఎంతో శ్రద్ధగా కోచింగ్‌ ఇచ్చేవాళ్లు. అంటే మా ముక్కలు మా పార్టీ వాళ్లు చూసి గైడ్‌ చేయవచ్చన్న మాట.

అందరూ సీరియస్‌గా ఆడుతున్నప్పుడు నావంతు వచ్చేసరికి ఏ కార్డు వెయ్యాలని నేను మా జట్టు గురువును అడిగేదాన్ని. “మణేలా ఎయ్యి!” అని మా తాతయ్య చెప్పేవాడు. “నా దగ్గర ఒక క్యూ, ఒక జే, ఒక పది, ఒక తొమ్మిది ఉన్నవి. మణేలా లేదు. ఏది ఎయ్యాలె?” అని నేను మొత్తం లిస్ట్‌ పెద్దగా చదివేదాన్ని. “అయ్యో! నీ పక్కకున్నోళ్లకు చూపియ్యి! లేకపోతె గుసగుసగా చెప్పు” అని తాతయ్య అనేవాడు. మన టోన్‌ పెద్ద స్టోనాయే మరి! ఏది చిన్నగా మాట్లాడాలో.. ఏది పెద్దగా చెప్పాలో తెలియదు. ‘మణేలా’ అంటే తొమ్మిదనే విషయం నాకు తెలియదు. అంతేకాదు వాళ్లు ‘నైలే పే దైలా’ అనీ, షరతు అనీ, ‘పైషర్త్‌’ అనీ, ‘పక్కా షర్త్‌’ అనీ, ‘డబల్‌’ అనీ, ‘కౌంట్‌’ అనీ ఏవేవో పందాలు కట్టేవారు. అందులో ఒక్క పదం కూడా నాకు తెలియకపోయేది. ‘నైలా’ అంటే తొమ్మిది, ‘దైలా’ అంటే పది.. ఇలా ఆ టెర్మినాలజీ అర్థం అయ్యేది కాదు. నాకు ఎక్కువగా

ఏ లు.. అదేనండీ ఎక్కలు, అందులోనూ ఇస్పేటు ఆసు తప్పకుండా వచ్చేది. అందుకే.. నాది లక్కీ హ్యాండ్‌ అని ఎక్కువసార్లు పిలిచేవారు. పేకాటలో ఎక్కువసార్లు ఆడిన కార్డ్స్‌ను ఎక్స్‌పర్ట్‌ ఆటగాళ్లు గుర్తుపట్టి, ఏ ముక్క ఏదో ఇట్టే చెప్పేస్తారట. అందుకని వాళ్లు వదిలేసిన సెట్‌ను శరత్‌ అన్నను అడిగి తీసుకున్నాం. సెలవులై పోయి మా ఊరికి వచ్చేటప్పుడు మా వెంట తెచ్చుకున్నాం.

ఓ ఆదివారం మధ్యాహ్నం భోజనాలయ్యాక నేనూ, అక్కా కార్డ్స్‌ ఆడదామని కూచున్నాం. నాన్న అటుగా వచ్చి చూశాడు. “మీకు ఇదెక్కడిది?!” అని తీవ్రంగా అడిగాడు. మేము చెప్పగానే కార్డ్స్‌ మా చేతుల్లోంచి లాక్కుని.. “అష్ట దరిద్రం ఇది! ఇంకెప్పుడు గూడ మీ చేతులల్ల కనపడొద్దు” అని తీసుకుపోయి.. పెంటలో పారేసి అగ్గిపుల్ల గీకి తగులబెట్టేశాడు. నాన్నకు అంత కోపం రావడం మేమెప్పుడూ చూడలేదు.

ఆ తరువాత అమ్మకు చెబితే.. “అవును! మీరు బయట శరీరశ్రమ చేసే ఆటలు ఆడండి. ఒద్దంటమా?! ఇంట్ల గూచొని ఆడే ఆటలెందుకని అన్నరేమో!” అన్నది. నేను వెంటనే.. “మరి చెస్‌, క్యారమ్‌ బోర్డు, చైనీస్‌ చెక్కర్‌ ఇంట్ల కూసొనే ఆడుతం గద!” అన్నాను లా పాయింట్‌ తీసి. “నీకు తెలివి ఎక్కువైంది. పేకాట అంటే వ్యసనం. శాన మంది దీనికోసం ఆస్తులు అమ్ముకుంటరట గూడ! మంచిది గాదని నాన ఒద్దన్నడు. పచ్చీస్‌ గూడ అంతే.. జూదం!” అన్నది అమ్మ. నేను ఇంకేదో అడగబోతుంటే.. “ఏ ఆట అయినా తెలివి కోసం, ఉత్సాహం కోసం ఆడితె ఏం గాదు. పైసలు పెట్టి ఆడితె మంచిది గాదు. గుర్తు పెట్టుకోండి!” అని అక్కణ్నుంచి వెళ్లిపోయింది.

ఆ తరువాత టీవీలో కులగోత్రాలు సినిమాలో ‘అయ్యయ్యో.. చేతిల డబ్బులు పోయెనే! అయ్యయ్యో.. జేబులు ఖాళీ ఆయెనే!’ పాట విన్నా, క్లబ్బులో పేకాటరాయుళ్ల అరెస్టు అనో, కోడి పందేలవాళ్లు అరెస్టు అనో విన్నప్పుడు.. నాన్న కోపానికి అర్థం తెలిసింది.

-నెల్లుట్ల రమాదేవి

రచయిత్రి

2024-09-14T20:13:27Z dg43tfdfdgfd