ఫ్రిజ్ ప్రమాదాలను ఎలా నివారించాలి? అసలు ఫ్రిజ్‌ను ఎలా ఉపయోగించాలి?

తమిళనాడులో కొన్ని రోజుల కిందట రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) పేలిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మధురై జిల్లాలో పెరియార్ బస్ స్టేషన్ దగ్గర ఉన్న ప్రైవేట్ మహిళా వసతి గృహంలో సెప్టెంబర్ 12 ఉదయం 4:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ రిఫ్రిజిరేటర్ల ప్రమాదాలకు సంబంధించి వార్తలు అప్పుడప్పుడు వస్తుంటాయి.

మరి, రిఫ్రిజిరేటర్లు ఎందుకు పేలుతాయి? ఇలాంటి ప్రమాదాలను నివారించడం ఎలా? కొత్త రిఫ్రిజిరేటర్ కొనేటప్పుడు ఏమేం గమనించాలి? ఎవరైనా ఉపయోగించిన రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలను వివరంగా చూద్దాం..

సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు?

రిఫ్రిజిరేటర్లను సరైన విధంగా ఉపయోగించకపోవడమే చాలా సందర్భాలలో ఇలాంటి ప్రమాదాలకు కారణమని కోయంబత్తూరులో 12 ఏళ్లుగా రిఫ్రిజిరేటర్లకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిశీలిస్తున్న రాజేశ్ చెప్పారు.

రిఫ్రిజిరేటర్‌ను వారానికోసారి లేదా రెండు వారాలకోసారి శుభ్రం చేసుకోవాలని ఓ ప్రైవేట్ కంపెనీ టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న రాజేశ్ సూచిస్తున్నారు.

‘‘సాధారణంగా మనం మన ఇళ్లలో ఫ్రిజ్‌లను, ఫ్రిజ్‌లలాగా, ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లాగా చూడం. వాటిపై ఏదో ఒకటి కప్పి ఉంచుతాం. వాటిని సరిగా శుభ్రం చేయం. పాత దుస్తులు, చెత్త, అట్టపెట్టెలు వంటి మండే వస్తువులను వాటికి దగ్గరగా పెడతాం. ముందు వాటన్నింటినీ అలా పెట్టడం మానేయాలి’’ అని రాజేశ్ చెప్పారు.

‘‘కరెంటు కనెక్షన్‌లో అకస్మాత్తుగా ఏదన్నా సమస్య వచ్చినా, షార్ట్ సర్క్యూట్ అయినా మంటలు ముందు ఈ వస్తువులకు అంటుకుంటాయి. అయితే, అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది ఫ్రిజ్ పేలిందని అనుకుంటారు’’ అని రాజేశ్ అన్నారు.

చేయకూడనివి ఏమిటి?

‘‘టెక్నాలజీ ఎంతో మారిపోయింది. ప్రజలకు కావాల్సిన సమాచారం అంతా వారి చేతుల్లో ఉంది. దీంతో చాలా మంది ఎలక్ట్రానిక్ వస్తువులకు కావాల్సిన మరమ్మత్తులు ఇంటిదగ్గరే సొంతంగా చేసుకోగలమన్న నమ్మకంతో ఉన్నారు. వారు యూట్యూబ్ వంటి సైట్‌లకు వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న లక్షల వీడియోల్లో ఒకదాన్ని ఎంచుకుంటారు. కొందరు విడిభాగాలను కొని వీడియోలో చెప్పినట్టుగా మరమ్మత్తులు చేసుకుంటారు. కానీ అలా చేయడం సురక్షితం కాదు’’ అని రాజేశ్ చెప్పారు.

ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఏం చేయకూడదనేదానిపై ఆయన సలహాలిస్తున్నారు.

  • రిఫ్రిజిరేటర్లకు మీ అంతట మీరే మరమ్మత్తులు చేసుకోవడానికి ప్రయత్నించవద్దు.
  • చౌకగా దొరికే నకిలీ విడిభాగాలు కొని వాటిని ఫ్రిజ్‌లలో అమర్చవద్దు.
  • కంప్రెసర్ దగ్గర ప్రాంతాల్లో తెగిన తీగలను మీ అంతట మీరే కనెక్ట్ చేయకూడదు. అలాంటి పనులను నిపుణులైన టెక్నీషియన్‌తో చేయించాలి.
  • ISO సర్టిఫికేట్ లేని స్టెబిలైజర్లను కొనకూడదు.
  • రిఫ్రిజిరేటర్ల దగ్గర దుస్తులు, అట్టపెట్టెలు వంటివి ఉంచకూడదు.

చేయాల్సినవేంటి?

కంప్రెసర్ దగ్గర ప్రాంతాల్లో డిస్‌కనెక్ట్ అయిన వైర్‌లను కనెక్ట్ లేదా డిస్ కనెక్ట్ చేయకూడదు. ఫ్రిజ్‌కు రిపేరు చేయించాల్స వస్తే.. ఏజెన్సీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రాజేష్ చెబుతున్నారు.

ఫ్రిజ్‌లో ఉన్న లోపాన్ని సాంకేతిక నిపుణుడు సరిచేసేదాకా ఆ ఫ్రిజ్‌ను ఉపయోగించవద్దని, స్టెబిలైజర్లు వాడాలని రాజేశ్ కోరారు.

“కొంచెం అదనంగా ఖర్చయినప్పటికీ.. నాణ్యమైన స్టెబిలైజర్లను వాడడం మంచిది. ఖర్చు తగ్గిద్దామన్న ఉద్దేశంతో కొందరు ISO సర్టిఫికేషన్ లేని తక్కువరకం స్టెబిలైజర్‌లను కొని వాడతారు. కొన్ని సార్లు ఫ్రిజ్‌కు కావాల్సిన స్థాయిలో ఆ స్టెబిలైజర్ల నుంచి రక్షణ లేక..అవి ప్రమాదాలకు దారితీస్తున్నాయి’’ అని రాజేశ్ వివరించారు.

సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ కోసం, సాధారణంగా 500 వాట్ల సామర్థ్యమున్న స్టెబిలైజర్‌లను ఉపయోగించడం మంచిది.

డబుల్ డోర్ ఫ్రిజ్‌లకు ఒక కిలోవాట్ వరకు సామర్థ్యం ఉన్న స్టెబిలైజర్లను ఉపయోగింవచ్చు.

రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఆసుపత్రులు మొదలైన వాటిలో ఉపయోగించే రిఫ్రిజిరేటర్‌ల అవసరాలకు తగ్గ స్టెబిలైజర్లను సాంకేతిక విభాగం సిఫార్సు చేస్తుంది.

ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి

ఫ్రిజ్ శుభ్రతతో ప్రమాదానికి సంబంధం లేనప్పటికీ, ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం అని రాజేష్ అన్నారు.

రిఫ్రిజిరేటర్‌ను 40డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర ఉంచాలని అమెరికా ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ సూచించింది.

వండిన ఆహారాన్ని నాలుగు రోజుల మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి.

వండని మాంసాన్ని రెండు రోజులు మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఫ్రిజ్ బయటి భాగాన్ని కూడా ఎప్పటికప్పుడు క్లాత్ లేదా సోప్‌తో శుభ్రం చేయాలి.

కండెన్సర్‌లోకి గాలి తేలిగ్గా వెళ్లేలా 'ఫ్రంట్ గ్రిల్'లో దుమ్ము చేరకుండా చూసుకోవాలి.

కండెన్సర్ కాయిల్‌ని సంవత్సరంలో కొన్ని సార్లయినా శుభ్రం చేయాలని అమెరికా ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ సిఫార్సు చేస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-09-15T13:11:13Z dg43tfdfdgfd