బోడ కాకరకాయలతో ఎన్ని లాభాలో తెలుసా.. అందుకే ఇంత డిమాండ్..

కాలానుగుణంగా, ప్రకృతి సిద్దంగా లభించే కూరగాయలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. అటువంటి కూరగాయలలో ఒకటైన బోడ కాకర కాయల్లో ఎన్నో రకాల ప్రోటీనులు ఉన్నాయి. అంతేకాదు మరెన్నో ఆయుర్వేద గుణాలను కూడా కలిగి ఉంది. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుచుకునే ఈ బోడ కాకర కాయలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. చికెన్ ధరలతో పోటీ పడుతున్న ఈ బోడకాకర కాయలు కిలోకు ఆదిలాబాద్ లో 150 నుండి 200 రూపాయల ధర పలుకుతుంటే, నిర్మల్ లో ఏకంగా 500 రూపాయల ధర పలుకుతోంది.

ఈ బోడ కాకర కాయలు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు జిల్లా ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు. కాగా వానా కాలంలోనే అది కూడా జూలై, ఆగస్టు నెలల్లో మాత్రమే లభించే ఈ బోడ కాకరకాయలను అడవి కాకర కాయలని, ఆకాకరకాయ, బోడ కాకర కాయ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు.

అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ బోడ కాకర కాయలు ఈ సీజన్లో విరివిగా లభిస్తాయి. అటవీ సమీపంలోని గ్రామాలకు చెందిన కొందరు గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళి వీటిని సేకరించి, పట్టణాలకు తెచ్చి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు. మరికొందరు హోల్ సేల్ గా వీటిని కొనుగోలు చేసి మార్కెట్ కు తీసుకువచ్చి విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు.

రైతు బజార్లు, ప్రధాన వాణిజ్య కూడళ్ళు, ప్రధాన రహదారుల పక్కన కూర్చోని వీటిని కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. ఈ అడవి కాకరకాయ వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉండటంతో ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటి ధర కూడా చికెన్ ధరలతో పోటీ పడుతోంది. కిలో బోడ కాకరకాయ ధర ఆదిలాబాద్ లో రెండు వందల వరకు పలుకుతుంటే, నిర్మల్ ఏకకంగా వీటి ధర 500 రూపాయలుగా ఉంది. ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉండటంతో ప్రజలు వీటి పట్ల ఆసక్తిని చూపుతున్నారు.

మరోవైపు అడవుల్లో విరివిగా లభించే ఈ బోడ కాకర కాయలను కొందరు రైతులు కూడా సాగుచేస్తున్నారు. మంచి లాభాలను కూడా పొందుతున్నారు. అయితే ఈ బోడ కాకర కాయలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు లభిస్తాయని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డా. ఏ. పోశాద్రి లోకల్ 18 తో తెలిపారు. అధిక మొత్తంలో క్రోమియం, జింకు లభిస్తుందని చెప్పారు.

2024-07-27T10:49:06Z dg43tfdfdgfd