మానసిక సమత్వమే కర్మయోగం

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః

సమః సిద్ధా వసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే॥

(భగవద్గీత 4-22)

అయాచితంగా లభించిన పదార్థాలతో సంతృప్తి చెందినవాడు, అసూయ లేనివాడు, సంతోషం-దుఃఖాలకు అతీతమైనవాడు, చేసేపని సిద్ధించినా, సిద్ధించకపోయినా సమంగా తీసుకునేవాడినే కర్మయోగి అంటారు. అలాంటి కర్మయోగి కర్మలను ఆచరించినా వాటి బంధనాల్లో చిక్కుకోడు. పనులు చేసేప్పుడు మన ప్రయత్నం ఏమీ లేకపోయినా విజయం కలగవచ్చు. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా అపజయం పాలుకావచ్చు. విజయం కలిగితే సంతోషం, అపజయంలో దుఃఖం కలగడం సాధారణమే. మనకు దక్కని విజయం ఇతరులకు దక్కినప్పుడు వారిపై అసూయ కలగడమూ కొంతవరకు సహజమే. అయితే ఎవరైతే వీటికి అతీతంగా స్పందిస్తారో వారిని కర్మయోగులు అంటున్నాడు కృష్ణపరమాత్మ. కర్మయోగుల మనసు… సంఘర్షణలకు అతీతంగా స్పందిస్తుంది.

స్వార్థ ప్రయోజనాల కోసం చేసే కర్మల వల్ల సమాజానికి శ్రేయస్సు కలగదు. అలాంటి కర్మలను దుష్కర్మలుగా చెబుతారు. సామాజిక ప్రయోజనం లక్ష్యంగా చేసే కర్మలను సత్కర్మలుగా పేర్కొన్నారు. జగమంతా భగవంతుడి ఆవిష్కరణే అన్న భావన కలిగినప్పుడే ఎదుటివారిపై సమదృష్టి కలుగుతుంది. ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా.. చేసే పనిలో నిబద్ధత, అంకితభావం, శ్రద్ధ, జవాబుదారీతనంతో పనిచేస్తే సంతృప్తితోపాటు సత్ఫలితమూ కలుగుతుంది. ఒకనాడు ఎక్కువ లాభం కలిగినా, తక్కువ లాభం వచ్చినా, నష్టం వచ్చినా.. పొంగిపోకుండా, కుంగిపోకుండా సమంగా మనసు నిలుస్తుంది.

ఒక సంస్థ ప్రక్రియపై దృష్టిపెట్టి పనిచేస్తుంది. మరొక సంస్థ ఫలితాలపై దృష్టిపెడుతుంది. ప్రకియపై దృష్టిపెట్టిన సంస్థకు ‘ఆశయం’ ఉంటుంది. న్యాయంగా, ధర్మంగా వ్యాపారం చేస్తుంది. ఫలితాలు ఎలా వచ్చినా దానిని పట్టించుకోదు. ఫలితాలపై దృష్టి సారించిన సంస్థకు ‘ఆశ’ ఉంటుంది. దానికి న్యాయాన్యాయాల కన్నా ఆశించిన ఫలితం రావడమే ప్రధానం. ఆశించడం ఘర్షణకు దారితీస్తుంది. ఆశించకుండా ఏది, ఎంత వచ్చినా సంతృప్తినిస్తుంది. జయాపజయాలలో సమస్థితిని పొందుతూ ప్రశాంతంగా ఉండటానికి సాధన అవసరం. సంఘర్షణలో ఘర్షణను కాకుండా ప్రశాంతతను ఆహ్వానించేవారే కర్మయోగులు అవుతారు.

ఒక రాజుకు ఓ సాధువు అడవిలోని పండును ఒకదానిని ప్రతిరోజూ ఇచ్చేవాడు. సాధువు వెళ్లగానే రాజు ఆ పండును బయటకు విసిరివేసేవాడు. ఒకనాడు ఆ పండును ఒక కోతి తీసుకొని కొరికింది. ఆశ్చర్యంగా పండు మధ్యలో ఒక మణి బయటపడింది. రాజుకు ఆశ్చర్యం వేసి తాను పారవేసిన పండ్లన్ని విప్పి చూశాడు. ప్రతిపండులోనూ ఒకమణి ఉన్నది. అతనికి జ్ఞానోదయమైంది. వెంటనే సాధువు దగ్గరికి వెళ్లి సాష్టాంగపడ్డాడు. సాధువు ఇచ్చింది అడవిలోని పండు అని బాహిరమైన రూపాన్ని చూసి అసహ్యించుకున్నాడే కానీ, అంతరంగంలోనికి చూడగలిగితే లోతైన ‘అవగాహన’ కుదిరేది. నిజానికి జయాపజయాలు, సుఖదుఃఖాలు సాపేక్షాలే కానీ, రెంటికి అతీతమైన ‘మనసే‘ సత్యాన్వేషణకు దారిచూపుతుంది.

పదాలకు అతీతమైనది భావన. ఆ భావనను అందుకునేందుకు సాధన కావాలి. సాధనలో ద్వంద్వాలకు అంటే లాభనష్టాలకు, సుఖదుఃఖాలకు అతీతమైన మానసిక స్థితి కుదురుతుంది. ఆ స్థితిలో చేసే పనిలో సమగ్రత సంపూర్ణతలు ఆవిష్కృతమవుతాయి. అయాచితంగానే ఫలితాలు అందివస్తాయి. ఆ ఫలితాలను సమాజంతో పంచుకునే విజ్ఞత వెలుగుచూస్తుంది. అసూయ, విభ్రాంతి, మాత్సర్యం లాంటి స్థానంలో ప్రేమ ఆప్యాయతలు చిగురిస్తాయి. రాయిరప్పల లాంటి జడ్వత్వం నుండి చెట్టుచేమల స్థాయికి, అటునుంచి పశుస్థితికి, ఆ తర్వాత మనుష్యస్థితికి, అటుపై దైవత్వానికి పరిణతి చెందడం జరుగుతుంది.

– పాలకుర్తి రామమూర్తి

2024-09-15T21:28:52Z dg43tfdfdgfd