‘‘మొదట పెళ్లికూతుర్ని, తర్వాత భార్యను, మరుసటి రోజే వితంతువుగా మారాను’’ - బంకర్‌లో నా ప్రేమకథ ఎలా ముగిసిందంటే...

‘‘ఆయన ఇనుప డబ్బా రేకుతో ఉంగరాలు తయారు చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. వెంటనే నేను ఒప్పుకున్నాను’’ అని వలెరియా సుబోటినా గుర్తు చేసుకున్నారు.

‘‘అతను నా సర్వస్వం. మా ఉంగరాలు కూడా చాలా బాగా కుదిరాయి’’ అని ఆమె చెప్పారు.

వలెరియా, యుక్రెయిన్ ఆర్మీ కెప్టెన్ అయిన ఆమె ప్రియుడు ఆండ్రీయ్ సుబోటిన్ (34)‌లు మరియుపూల్‌లో పెళ్లి చేసుకోవాలని యుద్ధానికి ముందు అనుకున్నారు.

పెళ్లి చేసుకొని స్నేహితులకు, బంధువులకు పార్టీ ఇవ్వాలని కలగన్నారు.

కానీ, పూర్తిస్థాయి దండయాత్ర మొదలైన తర్వాత యుక్రెయిన్‌లోని వ్యూహాత్మక తీరప్రాంత నగరమైన మరియుపూల్‌లోకి రష్యా ఆర్మీ చొరబడింది. రోజుల వ్యవధిలోనే ఆ నగరాన్ని చుట్టుముట్టింది.

మరియుపూల్‌పై రష్యా నిరంతర దాడులకు పాల్పడింది. వీధులన్నీ తగలబడ్డాయి. ఆహారం, విద్యుత్, నీటి కొరత ఏర్పడింది. అక్కడి నుంచి బయటికెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి.

దాదాపు మూడు నెలలపాటు ఈ ముట్టడి కొనసాగింది. వందలాది మంది పౌరులు చనిపోయినట్లు భావిస్తున్నారు.

అదే సమయంలో, మరియుపూల్‌కు చెందిన చాలా మంది అజోవస్టల్ స్టీల్ ప్లాంట్‌లో తలదాచుకున్నారు. అక్కడ దాదాపు 30కి పైగా బాంబు షెల్టర్లు ఉన్నాయి. న్యూక్లియర్ యుద్ధానికి రక్షణగా సోవియట్ కాలంలో ఈ బాంబు షెల్టర్లను నిర్మించారు.

ఇక్కడే వలెరియా పెళ్లి చేసుకున్నారు. కానీ రెండు రోజుల్లో వితంతువుగా మారారు.

బంకర్లలో జీవితం

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టినప్పుడు వలెరియా ఒక కవి. ఆ తర్వాత ఆమె యుక్రెయిన్ నేషనల్ గార్డ్‌లో ఒక భాగమైన అజోవ్ బ్రిగేడ్‌కు ప్రెస్ ఆఫీసర్‌గా పనిచేశారు.

మరియుపూల్‌పై రష్యా దాడులు తీవ్రం కావడంతో పౌరులతో పాటు యుక్రెయిన్ బలగాలు కూడా అజోవస్టల్ ప్లాంట్‌ బంకర్లలో తలదాచుకోవాల్సి వచ్చింది.

ఆ బంకర్ల ప్రవేశ ద్వారం ఒక రంధ్రంలా ఉంటుంది. పాక్షికంగా ధ్వంసమైన అనేక మెట్ల ద్వారా మీరు అందులోకి వెళ్లాల్సి ఉంటుందని వలెరియా చెప్పారు.

‘‘సందులు, సొరంగాల గుండా కాంక్రీట్ క్యూబ్ కనిపించేంత వరకు కిందకు దిగుతుండాలి. కాంక్రీట్ క్యూబ్ అనేది ఒక సురక్షితమైన గది లాంటిది’’ అని ఆమె తెలిపారు.

బంకర్లలో ప్రజలు తాత్కాలిక కిచెన్లను ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిపోయిన పదార్థాలతో పొయ్యి మీద ఆహారం వండుతారు.

పిండి దొరికినప్పుడు దానితో కేకుల్లా తయారు చేసేవారు.

‘‘దాన్ని మేం బ్రెడ్‌లా భావించేవాళ్లం. పిండిలో కేవలం నీళ్లు పోసి వాటిని చేసేవారు. వాటిని తింటూనే మేం బతికాం. అది కరవు లాంటి పరిస్థితి. అక్కడ ఎలుకల్లా బతికాం. దొరికిన ప్రతీదాన్ని అందరం తీసుకున్నాం. కొన్ని చోట్ల అయితే పూర్తిగా చీకటిగా ఉండేది. కానీ, ఆ చీకటికి మా కళ్లు అలవాటుపడిపోయి అదంతా సాధారణమే అనిపిస్తుంది. కానీ, అక్కడ మా జీవితాల్లో ఏదీ సరిగా లేదు’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

2022 ఏప్రిల్ 15న ఆ ప్లాంట్ మీద ఒక భారీ ఏరియల్ బాంబును వేయడంతో వలెరియా గాయాల పాలయ్యారు.

‘‘మృతదేహాల మధ్య నన్ను గుర్తించారు. అక్కడ బతికి బయటపడింది నేనొక్కదాన్నే. అది అద్భుతం, అలాగే భయంకరమైన విషాదం కూడా’’ అని ఆమె చెప్పారు.

అజోవస్టల్‌లోని అండర్‌గ్రౌండ్ ఆసుపత్రిలో ఆమె ఎనిమిది రోజులు గడపాల్సి వచ్చింది.

తెగిపడిన అవయవాలతో చెల్లాచెదురుగా మారిన చోట వందలాది సైనికులతో పాటు ఆమెకు కూడా చికిత్స అందించారు.

‘‘అక్కడ ఔషధాల కొరత ఉండేది. సైనికులకు సరైన వైద్య సహాయం అందదు. అక్కడంతా రక్తం వాసన, కుళ్లిపోయిన వాసన వచ్చేది’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

వలెరియా భాగస్వామి ఆండ్రీయ్ కూడా అజోవస్టల్‌ వద్దే విధులు నిర్వహించేవారు. ఆమె గాయపడిన సమయంలోనే ఆ బంకర్‌లోనే అతను పెళ్లి ప్రతిపాదన చేశారు.

మే 5న పెళ్లికి అవసరమైన పత్రాల మీద వారిద్దరూ సంతకాలు చేశారు. కీయెవ్‌లోని ఆండ్రీయ్ తల్లిదండ్రులకు ఆ పత్రాల కాపీలను పంపించారు. వారి పెళ్లిని నమోదు చేయించడం కోసం వారు ఆ పత్రాలను రిజిస్ట్రీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

బంకర్‌లోనే వారి పెళ్లి వేడుకలు చేసుకున్నారు. మిలిటరీ యూనిఫారాలను పెళ్లి దుస్తులుగా భావించారు. ఇనుప రేకుతో చేసిన ఉంగరాలనే పెళ్లిలో వారు మార్చుకున్నారు.

యుద్ధం ముగిసిన వెంటనే అసలైన వివాహపు ఉంగరం కొనిస్తానని వలెరియాకు ఆండ్రీయ్ ప్రామిస్ చేశారు.

కానీ, మే 7న ఒక మిషన్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆండ్రీయ్ చనిపోయారు.

‘‘ఆండ్రీయ్ మరణవార్త తెలియకముందు, ఆరోజు నేను చాలా మంచి మూడ్‌లో ఉన్నాను. నాకు అప్పుడే పెళ్లయింది. ప్రేమించిన వ్యక్తి నాతో ఉన్నాడనే ఆనందంలో ఉన్నాను’’ అని వలెరియా చెప్పారు.

కానీ, తన భర్త మరణం గురించి తెలిసినప్పుడు తాను ఏడ్వలేదని ఆమె వెల్లడించారు.

‘‘అజోవస్టల్‌లో ఆ రోజు ఒక సంవత్సరంలా గడిచింది. మొదట నేను పెళ్లి కూతుర్ని, మరుసటి రోజు భార్యను, ఆ తర్వాత నేను వితంతువును. ఈ మాట అనడానికి కూడా నాకు భయంగా ఉంది’’ అని ఆమె వివరించారు.

యుద్ధ ఖైదీలు

మే నెల ఆరంభంలో అజోవస్టల్ స్టీల్ ప్లాంట్‌లో 80 రోజుల పాటు మెడిసిన్, ఆహారం లేకుండా జీవించిన యుక్రెయిన్ పౌరులను తక్షణం ఖాళీ చేయించాల్సిన అవసరం ఏర్పడింది.

మొదట ప్లాంట్ నుంచి పౌరులు వెళ్లిపోయేందుకు అనుమతించారు. తర్వాత అందులోని యుక్రెయిన్ సైనికులను రష్యా ఆర్మీ బందీలుగా చేసుకుంది.

ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా వారందర్నీ విడుదల చేస్తారని ఆశించారు.

కానీ, రెండేళ్లు గడిచిపోయాయి. 900 మంది అజోవ్ బ్రిగేడ్ సభ్యులతో సహా వేలాది మంది యుక్రెయిన్ సైనికులు ఇంకా రష్యా ఆధీనంలోనే ఉన్నారు. అజోవ్ బ్రిగేడ్ సభ్యులను యుక్రెయిన్‌లో జాతీయ వీరులుగా పరిగణిస్తారు.

వారి కుటుంబాలు నిరసనలు చేపడుతున్నాయి. ఖైదీల మార్పిడి కోసం కృషి చేయాలంటూ యుక్రెయిన్ అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నాయి. యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ చాలా క్లిష్టమైనది.

దాడి మొదలైనప్పటి నుంచి ఖైదీల మార్పిడి ప్రక్రియలో భాగంగా రష్యా నుంచి దాదాపు 3 వేల మంది యుక్రెయిన్ ఖైదీలు విడుదలయ్యారు.

ఇంకా 10 వేల మందికి పైగా రష్యా కస్టడీలోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు.

యుక్రెయిన్ యుద్ధ ఖైదీలను చిత్రవధ చేస్తున్నట్లు, తీవ్రంగా కొడుతున్నట్లు, ఎలక్ట్రిక్ షాక్‌, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, సామూహికంగా ఉరి తీస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ఇటీవల జరిపిన పరిశోధన పేర్కొంది.

వలెరియా కూడా 11 నెలల పాటు రష్యా వద్ద బందీగా ఉన్నారు. అక్కడ తనను హింసించినట్లు, వేధించినట్లు ఆమె చెప్పారు. జైల్లో తన జీవితం గురించి ఈ మధ్యే ఆమె ఒక పుస్తకాన్ని ప్రచురించారు.

ఆమె భర్త ఆండ్రీయ్ మృతదేహం అజోవస్టల్ స్టీల్ ప్లాంట్‌లోనే ఉండిపోయింది.

‘‘నేను ప్రేమించిన ప్రతీదాన్ని రష్యన్లు ధ్వంసం చేశారు. మా నగరం, నా స్నేహితులు, నా భర్తను పొట్టన పెట్టుకున్నారు’’ అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-05-08T02:45:32Z dg43tfdfdgfd