రెండేళ్లుగా పడవలోనే అన్ని పనులు కానిచ్చేస్తున్న మహిళ.. బాయ్ ఫ్రెండ్ కూడా దొరికాడు..!

ప్రపంచంలో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఒకరికి మంచి అనిపించింది ఇంకొకరికి వింతగా అనిపిస్తుంది. అందుకే బెస్ట్ లైఫ్ అనే కాన్సెప్ట్‌కు అర్థమే ఉండదు. ఇష్టం వచ్చినట్లు బతకడమే అసలైన సంతోషాన్ని ఇస్తుంది. కానీ పరిస్థితుల కారణంగా అందరికీ ఇలాంటి అదృష్టం దక్కదు. కొందరు మాత్రమే అన్ని అడ్డంకులను అధిగమించి నచ్చిన రంగంలో కెరీర్‌ వెతుక్కుంటారు, లైఫ్‌ను కూడా నచ్చినట్లు ఎంజాయ్ చేస్తారు. అలాంటి కొద్ది మందిలో ఇంగ్లాండ్‌కు చెందిన ఓ యువతి కూడా ఉంది.

ఆమె ఒక పక్క ప్రపంచాన్ని చుట్టేస్తూ, మరో పక్క నచ్చిన పని చేస్తూ చేతి నిండా డబ్బు సంపాదిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యువతి రెండేళ్లుగా క్రూయిజ్ షిప్‌లోనే నివసిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షిప్‌లోనే ఆమెకు ఒక బాయ్‌ ఫ్రెండ్‌ కూడా దొరికాడు. దీంతో ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు.

* రెండేళ్లుగా షిప్‌లోనే!

ది సన్ నివేదిక ప్రకారం, ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌కు చెందిన 23 ఏళ్ల ఎలెన్ హార్డీ, 2021 నుంచి క్రూయిజ్ షిప్‌లో నివసిస్తోంది. ఓడలో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చూస్తోంది. క్రూయిజ్‌లోనే ఉంటూ ఆస్ట్రేలియా, ఫిజీ, వనాటు వంటి దేశాలను సందర్శించింది.

* ఏం పని చేస్తుంది?

ఎలెన్ హార్డీ షిప్‌లో డాన్సర్‌గా పనిచేస్తోంది. 2022లో డ్యాన్సర్‌గా చేరింది. ఆ తర్వాత ఒక క్రూయిజ్ నుంచి మరొక క్రూయిజ్‌కి మారింది. అప్పటి నుంచి తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో 3,000 మంది ప్రయాణీకులను అలరిస్తూ, ఓడలోనే జీవితం గడుపుతోంది. ప్రస్తుతం ఆమె నైన్‌-డే క్రూయిజ్‌లో ఉంది.

* షిప్‌లోనే లవ్

ఎలెన్ క్రూయిజ్‌ జర్నీలోనే 28 ఏళ్ల లూయిస్‌ను కలిసింది. క్రమంగా వారు మరింత దగ్గరై ప్రేమలో పడ్డారు. లూయిస్ డెక్ ఆఫీసర్, క్రూయిజ్‌ సిబ్బందిలో సభ్యుడు. వారు మొదట సింగపూర్‌లో కలుసుకున్నారు. లూయిస్‌కి తాత్కాలికంగా మరొక క్రూయిజ్‌లో బాధ్యతలు అప్పగించినా, అతడు ఎలెన్ పనిచేసే చోటే తిరిగి పోస్టింగ్‌ తీసుకున్నాడు. వేర్వేరు దేశాలకు చెందిన వీరిద్దరూ ఉద్యోగాల కారణంగా విహారయాత్రలో కలుసుకున్నారు. ఇప్పుడు ప్రేమలో, జీవితంలో కలిసి ప్రయాణిస్తున్నారు.

---- Polls module would be displayed here ----

తన జర్నీ గురించి ఎలెన్ హార్డీ మాట్లాడుతూ.. చాలా కాలంగా ఇంటికి దూరంగా ఉన్నానని, చాలా రోజులు హోమ్‌సిక్‌గా అనిపించిందని చెప్పింది. అయితే చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉండటంతో ఎంటర్‌టైన్‌ అవుతుంటానని తెలిపింది.

* ఐదేళ్ల నుంచే డ్యాన్స్

ఎలెన్ మంచి డ్యాన్సర్. ఐదు సంవత్సరాల వయస్సులోనే డ్యాన్స్‌ చేయడం ప్రారంభించింది. జాజ్, బ్యాలెట్, ట్యాప్, మోడ్రన్ డ్యాన్సుల్లో ప్రావీణ్యం సంపాదించింది. మొదట 19 ఏళ్ళ వయసులో క్రూయిజ్ షిప్ పోస్ట్ కోసం ఆడిషన్ ఇచ్చింది. కానీ కరోనా కారణంగా ఆ ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. తర్వాత 2022లో అనుకోకుండా క్రూయిజ్ షిప్‌లో డ్యాన్స్ చేయడానికి జాబ్ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు, ఆమె అటు ట్రావెలింగ్‌, ఇటు డ్యాన్స్‌ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. ఇటు బాయ్‌ఫ్రెండ్‌తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. క్రూయిజ్‌ కాంట్రాక్ట్ ముగిస్తేనే ఎలెన్ ఇంటికి తిరిగి వస్తుంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల కాంట్రాక్ట్‌లో ఉంది.

2024-07-26T03:28:56Z dg43tfdfdgfd