పెద్ద పెద్ద ఇమారత్‌ల ముందునుంచి
నడుస్తూ నడుస్తూ
చౌరస్తా దగ్గరికొచ్చాను
విశాలంగా చాపిన చేతుల్లా
నాలుగు దిక్కులా రోడ్లు
ఎవరో తరుముతున్నట్టు
రంగు రంగుల కార్లూ
బస్సులూ మనుషులూ
ఒకటే పరుగు
అందరూ ముందు
పోయేవాళ్లని దాటేయాలనే
అంతా రద్దీ రద్దీ రణగొణ ధ్వని
పరుగు పందాన్ని చూస్తూ
ఊపిరాడక పలకరించేవాళ్లు లేక
ఒంటరిగా బిక్కమొహమేసుకు
నిలబడిన
చౌరస్తాని చూసి జాలేసింది
పాపం ఒంటరిదాన్ని అనునయిద్దామని
వీపుతట్టి పలకరిద్దామని
దగ్గరకు వెళ్లాను
చిత్రంగా
నేను చౌరస్తాలోకి ఒలికిపోయాను
చౌరస్తా నాలోకి ఇంకిపోయింది
మహానగరంలో ఒంటరితనం
ముసి ముసి నవ్వులు నవ్వింది
– ఆనంద్ వారాల 94405 01281
2024-06-09T21:40:08Z