VASTU SHASTRA | ఒక యజమానికి ఎన్ని ఇండ్లు అయినా ఉండవచ్చా? ఎక్కువగా ఉంటే?

Vastu Shastra | కొన్ని కులాల వారికి ఇండ్లు అమ్మడం, కొనడం చేయొద్దని కొందరు చెబుతుంటారు. అలా చేయవచ్చా?

– కె. ఆనంద్‌, ఎల్‌బీనగర్‌.

చాలా ఇబ్బంది కలిగించే ప్రశ్న. గృహం అందరికీ అవసరం. మనిషి ఏ ప్రదేశంలో, ఏ కులాచార – మతాచారంలో ఉన్నా.. అతనికీ అవసరాలు ఉంటాయి. ‘ఫలానా వారి ఇల్లు కొనగూడదు. ఫలానా వారికి ఇల్లు అమ్మకూడదు’ అనేది తెలిసినవాళ్ల లక్షణం కాదు. శాస్త్రహృదయం అసలే లేదు. గృహం.. జీవ లక్షణం. సృష్టిలో అనేక రకాల జీవులు.. పక్షులు, పాములు, కప్పలు, సీతాకోక చిలుకలు అన్నీ నివాస ప్రాధాన్యం కలిగినవే! ఇక్కడ జాతికి, కులానికి వివక్షత అనేది మనిషి అవలక్షణం అవుతుంది. మంచి ఇల్లు ఏ వ్యక్తిది అయినా కొనవచ్చు. దిక్కు మాలిన ఇల్లు ఏ రాజుది అయినా తీసుకోవద్దు. యోగ్యత అనేది ప్రధానం. మనం అన్నం వండుకునే కుక్కర్‌.. ఏ మతం, ఏ కులం వాళ్లు తయారుచేస్తున్నారో మనకు తెలుసా? ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో భాగంగా మనం పెట్టుకునే గుండె, కిడ్నీలు ఏ కులంవారివో తెలుసా? అన్నీ బాగుంటే.. అన్ని ఇండ్లూ కొనుక్కోవచ్చు. చక్కగా జీవనం చేయవచ్చు.

నగరంలో ఉన్న మా ఇంటికి ఉత్తరంలో మెట్రో స్టేషన్‌ ఉన్నది. అలా ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?

– కె. సంతోషిణి, చిట్యాల.

మహానగరాలలో ఎన్నో రకాలు మార్పులు జరుగుతూ ఉంటాయి. అభివృద్ధి, అవసరాలు అనే వాటిని ఎవరూ ఆపలేరు. తద్వారా నగర జీవుల ఇండ్లకు కొన్నిసార్లు అసౌకర్యం కలుగవచ్చు. అధిక లాభం కూడా కలుగవచ్చు. మీకు నగరంలో ఉన్న ఇంటికి ఉత్తరంలో మెట్రో స్టేషన్‌ వచ్చింది అంటే.. మీ ఇంటికి దానికి మధ్య ఎంతో కొంతదూరం ఉంటే ఇబ్బంది ఉండదు. ప్రధానంగా.. మన నివాసానికి కాంపౌండ్‌ ఉంటే, ఎత్తయిన పరిసరాలలో ఉన్నా ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా కొన్ని సాధారణ ఇండ్లకు.. ముఖ్యంగా తూర్పు హద్దుమీద, ఉత్తరం హద్దుమీద ఇతర నిర్మాణాలు అంటుకొని ఉంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లు, మార్కెట్లు ఉన్నచోట శబ్ద కాలుష్యం ఉంటుంది. అది అనారోగ్యాలకు మూలం అవుతుంది. మీ ఇంటిని బట్టి, దాని స్థానాన్ని బట్టి.. ఏవైనా మార్చుకుంటారా? కమర్షియల్‌గా చేసుకుంటారా చూసుకోండి. ఏదేమైనా.. మంచి ఇంట్లో ఉండండి.

మాది డూప్లెక్స్‌. మాకు అన్ని అంతస్తుల్లో చిన్నగా అయినా సరే.. పాంట్రీలు (కిచెన్లు) కావాలి. అలా ఉండొచ్చా? ఉంటే.. అవి ఎక్కడ ఉండాలి?

– ఎస్‌ చంద్రశేఖర్‌, కోదాడ.

మనిషి ఉన్నచోటనే అన్నీ ఉండాలి అనుకొని.. ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాడు. సుఖానికి అలవాటుపడి.. కాలు బయట పెట్టకుండా ఉండాలి అనుకుంటున్నాడు. అందుకే, చిన్న వయసులోనే అనేక రకాల రోగాలతో.. గదిలోంచి కాలు బయటపెట్టకుండానే కుమిలిపోతున్నాడు. ఇది.. నేటి గృహ ప్రవర్తన. ప్రతి అంతస్తుకూ, ప్రతి మాస్టర్‌ బెడ్‌రూమ్‌ పక్కన, జిమ్‌ పక్కన, హోమ్‌ థియేటర్‌ పక్కన.. ఇలా అన్ని చోట్లా కిచెన్లు పెట్టుకుంటూ పోవడం సరైన విధానం కాదు. డూప్లెక్స్‌ ఇండ్లలో ఇలా పాంట్రీల పేరుతో, ప్రైవసీ పేరుతో వంట గదులను ఏర్పాటుచేసుకోవడం వల్ల ఇంటి వైశాల్యంలో ‘అగ్ని స్థానం’ పెరుగుతుంది. అది స్త్రీల మీద, పిల్లల మీదా ప్రభావం కలిగిస్తుంది. ఒక ఇల్లు – ఒక కిచెన్‌. ఒక మనిషి – ఒక గుండె.. ఇది ప్రకృతి నియమం. మీ నిర్ణయం మంచిదికాదు. అలాంటప్పుడు ఎవరి అంతస్తులో వారు సపరేటు చేసుకొని, ఎవరి కిచెన్‌ వారు వాడుకోండి.

ఒక యజమానికి ఎన్ని ఇండ్లు అయినా ఉండవచ్చా? ఎక్కువగా ఉంటే.. వేరేవారి పేర్లమీద రిజిస్ట్రేషన్‌ చేయాలా?

– ఆదిలక్ష్మి, నారాయణపేట.

ఎన్ని ఇండ్లు అయినా ఉండొచ్చు కానీ.. అన్ని ఇండ్లూ బాగుంటేనే మంచిది. లేదంటే అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చెప్పలేము. నిజానికి ఒక కుటుంబానికి ఒక ఇల్లు లేదా ఊరిలో, ఫామ్‌లో ఒక్కో ఇల్లు.. ఇలా అవసరం ఉండొచ్చు. అంతవరకూ చాలు. అంటే, వాడుకునే ఇండ్లు, ఉండగలిగే ఇండ్లు ఉంటే ఎంతో మంచిది. ఇక్కడ కమర్షియల్‌ భవనాలు లెక్కలోకి రావు. అది వ్యాపారం.

 

ఇక అన్ని ఇండ్లు ఎవరి పేరుమీద ఉన్నాయి అనేది.. అది వ్యక్తిగతం. కొందరు ఇండ్లను పిల్లలకు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తారు. కొందరు భార్య పేరుమీద పెడతారు. ఎవరు, ఎవరి పేర్లమీద ఇండ్లు (గృహాలు) కట్టినా.. అవి ఎక్కడ ఉన్నా.. అవి ఆ యజమానులకు సంబంధించినవే కాబట్టి, ఆ ఇండ్లు వాళ్లవే అవుతాయి. ఆ ఇంటి మంచి చెడ్డలు కూడా వారికే చెందుతాయి. ఇండ్లు ఎన్ని ఉన్నా.. ఎవరి పేరుమీద ఉన్నా ఫరవాలేదు. కానీ శాస్త్రపరంగా అవి నివాసయోగ్యమైనవి కావాలి.

 – సుద్దాల సుధాకర్‌ తేజ

[email protected]

Cell: 7993467678

2024-06-08T21:03:17Z dg43tfdfdgfd